Anaganaga Oka Raithu

అనగనగా  ఒక రైతు

farmer
హైదరాబాద్ లో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆటో దిగాడు ఒక వృద్ధుడు. ఎదురు చూపులతో అలసిన కళ్ళు, నాగలి బరువుకి కృంగిన భుజాలు, కాస్త  సునిసంగా చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్ధం అవుతుంది అతడు ఒక రైతు అని.  అతడు లోపలికి వెళ్లబోతుంటే  సెక్యూరిటీ గార్డ్ ఆపాడు. అతడి పేరు ఊరు వివరాలు కొనుక్కుని ఒక్క నిమిషం ఉండమని సైగ చేసాడు. ఏ ఫ్లాట్ కి వెళ్ళాలో కనుక్కొని అతడిని అక్కడే ఉండమని ఇంటెర్క్యామ్ లో ఆ ఫ్లాట్ కి ఫోన్ చేసాడు. ఫ్లాట్ ఓనర్ ఫోన్ ఎత్తగానే వినయంగా చెప్పాడు.
“సర్! మీ కోసం ఒక పెద్దాయన వచ్చాడు.” అని ఊరు పేరు చెప్పాడు. తను వచ్చింది తన కొడుకు ఇంటికా లేక శత్రుదేశం  సరిహద్దుకా  అని ఆశ్చర్యపోతున్నాడు వృద్దుడు.
“ఓయ్! అయన మా నాన్నయా. వెంటనే పంపించు” అని ఫోన్ పెట్టేసాడు.
“రండి సర్!” అని సామాను అందుకుని ఆ వృద్ధున్ని దగ్గరుండి  ఫ్లాట్ కి తీసుకుని వచ్చి డోర్ బెల్ కొట్టాడు. కోడలు తలుపు తీసింది.
“రండి మావయ్య! ఊరిలో అంతా కులాసానా?” అంటూ సామాను అందుకుంది. అతడు సమాధానం చెప్పేలోపే తాతయ్యా  అంటూ  వచ్చి వాటేసుకున్నాడు  మనవడు.
“ఎరా పరీక్షలు అయ్యిపోయాయా. ఈ సారి  దగ్గరుండి మరీ సంక్రాతి పండక్కి నిన్ను తీసుకుని రమ్మంది మీ నానమ్మ” అని అంటూ కొడుకు ముఖంలో కనపడే భావాల్ని గమనించ సాగాడు.
ఆ మాటలేవి తన చెవిన పడనట్టే  ఉన్నాడు కొడుకు.
“ఇంకా అవ్వలేదు తాతయ్య. ఇవాల్టితో లాస్ట్! రేపటి నుండి హాలిడేస్” అని చెప్పాడు మనవడు.
“అవునా! ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తున్నావా?” అని అడిగాడు.
“రాస్తున్నాను తాతయ్య”
ఇంతలో కొడుకు కలుగచేసుకుని “లాస్ట్ ఎగ్జామ్స్ కి నీకు వచ్చిన ప్రైజ్ చూపించు తాతయ్యకి” అని గర్వంగా అన్నాడు.
ఇంతలో కోడలు కలుగచేసుకుని “అవన్నీ సాయంత్రం తీరిగ్గా చూసుకోవచ్చు, త్వరగా తెమలండి, వాడికి స్కూల్ టైం అవుతోంది” అని హెచ్చరించింది.
గడియారం వంక చూస్తూ “అబ్బో  నిజమే! నాన్నా,నువ్వు రిలాక్స్ అవ్వు  సాయంత్రం త్వరగా వస్తా తీరిగ్గా మాట్లాడుకుందాం” అని వొత్తి పలికి  కొడుకు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాడు.
రాత్రంతా ప్రయాణం బడలికతో  ఉన్న అతడు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని ఆలా ఒక కునుకు తీసాడు.
                                          ****************
రాత్రికి  అంతా కలసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనాలు చేస్తున్నారు. వృద్ధుడు  మళ్ళి  ఊరు వెళ్లే ప్రస్తావన తెచ్చాడు.
“నేను, కోడలు, మనవడు రేపు ఊరు బయలుదేరుతాం, నువ్వు కూడా పండక్కి ఒక రోజు ముందే ఊరు వచ్చేలా ప్లాన్ చేసుకో” అన్నాడు
“ఊర్లో ఏం చేస్తాం నాన్నా? చక్కగా అమ్మని కూడా ఇక్కడికే రమ్మను, అందరం ఇక్కడే ఎంజాయ్ చేద్దాం.”
“అలా కాదురా. రెండు మూడు ఏళ్లుగా ఇలాంటి సాకులే చెప్పి  ఊరికి రావటం లేదని ఉసూరు మనిపిస్తున్నావ్, అందుకే ఈ సారి నేనే స్వయంగా వచ్చాను. మనవడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు.  వాడికి వాడి మూలాల సంగతి కాస్త తెలిస్తే బాగుంటుంది కదాని…”
“ఏం మూలాలు నాన్నా? అక్కడ పుట్టిపెరిగినవాళ్లకే అక్కడ ఏమి మిగలలేదు. ఒక తరం దూరం అయిపోయిన వాళ్లకి ఇంకా అక్కడ ఏం మూలాలు ఉంటాయి?”
“ఆలా కాకపోయినా, భోగి పండగ, వాడికి భోగి పళ్ళు పోసి, సాక్షాత్తు  ఆ మహా విష్ణువుకే  బదరీ ఫలలతో పూజ చేసుకున్నట్టు భావించి, వాడిని మనసారా  ఆశీర్వదించి, ఎదో ఆలా తరాలుగా వస్తున్న ఆచారం చివర్లో పాడుచేసుకోవటం ఎందుకా అని”

“అంతే కదా! ఇక్కడ కూడా బంతి పూలు బధిరీ పళ్ళు బాగానే  దొరుకుతాయి, అదేదో ఇక్కడే పోసుకుందాం. అమ్మని కూడా రమ్మనండి”

“అంటే భోగి పళ్ళు ఒక్కటే కాదు! ఇంకా మన పండగ ఆచారాలు, సంప్రదాయాలు, పొలాలు, చెరువు గట్లు,  పెంకుటిళ్లు, కావిళ్ళు, నాగళ్లు  ఇలా అన్ని వాడికి చూపించినట్టు ఉంటుంది కదాని..”
“మనిషి చూపు ఎప్పుడు భవిష్యత్తు వైపు ఉండాలి నాన్నా, గతం లోకి కాదు, మీరు చెప్పేవేమి వాడి కెరీర్ కి ఏ రకం గాను పనికి రావు.. వాడు డాక్టర్ అవ్వాల్సినవాడు, పెయింటర్ కాదు, నిజమైన పండగ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, ఇక్కడే ఉండండి, మంచి మంచి సినిమాలు, ఎక్సహిబిషన్లు, సర్కసులు, గోల్కొండ, చార్మినార్, మ్యూజియం ఇంకా చాల ఎన్నెన్నో, అన్ని చూసి తీరాల్సిందే,పైగా సంక్రాంతికి సగం మంది పైగా ఊర్లు పోతారేమో, ట్రాఫిక్ లేని హైదరాబాద్ ఎంత బాగుంటుందో కూడా మీకు చూపిస్తాను”
“ఉత్తప్పుడు ట్రాఫిక్లో పడి  ఇంటికి  ఆఫీస్ కి పరుగులు, సెలవలు అప్పుడేమో సినిమాలకి, సమాధులకిి పరుగులు, ఇంకెప్పుడురా ఒక్క పూట  ఖాళీగా కూర్చొని, నేనేమిటి, నా గతమేమిటి నా పయనమెటు అని ఆత్మ పరిశీలన చేసుకునేది?”
“అంత అవసరం ఏం వచ్చింది నాన్నా! ఇప్పుడు అంతా  బాగానే ఉన్నాంగా?”
“బాగున్నార్రా! చాల బాగున్నారు! ఎంత సేపు మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, వాళ్ళ బాగోగులు. పక్క ఫ్లాట్ లో ఎవరున్నారీయ తెలీదు, ఎదుటి ఫ్లాట్ లో ఎవరున్నారో తెలీదు.. చివరికి తన సర్వస్వం ధారపోసి నిన్ను ఈ రోజు ఈ స్థితిలో ఉంచిన నీ తండ్రి నిన్ను చూడటానికి వస్తే, నీ కాపలావాని ముందు శరణార్ధిలా నిలబడి ఊరు పేరు చెబితే గాని వాడు నన్ను లోపలి రానియ్యడు.. చాల బాగున్నారు.”
“అయ్యో నాన్నా! నువ్వు దానికి ఫీల్ అయ్యావా? అది ఇక్కడ ప్రొసీజర్. కాస్త డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా కదా తెలియని వాళ్ళు వచ్చి అవి ఇవి పట్టుకుపోకుండా  కాపలా అంతే. నిన్ను అవమానించాలి అని కాదు.”
“అది అవమానం అని ఇప్పుడు నీకు అనిపించదు, రేపు వీడు  పెద్దై  ఎక్కడో సెట్టేలే అయ్యాక, వాని చూడటానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ వాడు, “మీరు అయన తండ్రా? ఏది డిఎన్ఏ శాంపిల్ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు  అప్పుడు తెలుస్తుంది నీకు, పెరిగిన టెక్నాలజీని అభినందించాలో, లేక తెలియకుండా పెరిగిన దూరానికి చింతించాలో” ఆవేశంగా అన్నాడు
“ఆవేశపడకు నాన్నా!  రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండు అని ఒక సామెత. ఇది ఇక్కడి జీవన విధానం. దానికి మేము అలవాటు పడిపోయాం. నువ్వు కొత్తగా వచ్చావ్ కాబట్టి నీకు అన్ని వింతగా అనిపిస్తున్నాయి”
“సరే ! ఆ వింతలు విడ్డురాలు అన్ని నువ్వే అలవాటు చేసుకో. నన్ను మరోసారి పిలవకు ఇక్కడికి. మనవడిని ఎలాగూ పంపను అంటున్నావు. నేను ఇప్పుడే భయలుదేరుతున్నాను. ఆ పిచ్చిది మీరు వస్తారని
బొల్లన్ని  ఏర్పాట్లు  చేస్తున్నది. వెంటనే వెళ్లి ఆపేయమని చెప్పాలి.” అంటూ చెయ్యి కడుక్కుని లేచిపోయాడు.
“ఇన్నేళ్ళలో తన తండ్రి ఇంతలా frustrate అవ్వటం ఎప్పుడో చూడని కొడుకు మెల్లిగా అయన దగ్గరకి వెళ్లి చేతిలోకి అయన చెయ్యి తీసుకుని, “ఏమిటి నాన్నా ఇది. నువ్వు ఇంతలా ఇర్రిటేట్ అవుతున్నావ్ అంటే
ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. గత రెండు మూడేళ్ళుగా మేము పండగకి రానప్పుడు నువ్వేం అనలేదుగా.. ఆ ధైర్యం తోనే  అలా మాట్లాడాను. పైగా ఉత్తప్పుడు  నేను ఆఫీస్ పనిలో, తాను ఇంటి పనిలో,వీడు స్కూల్ హడావిడిలో చాలా  ఇదిగా ఉంటాం. మేము కాస్త కలసి టైం గడిపేది ఈ సెలవు రోజుల్లోనే.. అది నా స్వార్ధం. ఇంతకు మించిన కారణం నన్ను ఒప్పించే వింధంగా ఏమైనా  ఉంటె చెప్పి వాళ్ళని తీసుకెళ్ళు. లేని పక్షంలో అమ్మ కూడా ఇక్కడికే రమ్మను.” క్లుప్తంగా చెప్పాడు
అసలు విషయం చెప్పేద్దామా అని తండ్రి ఒక నిమిషం ఆలోచించాడు. చెప్పండి అన్నట్టుగా కొడుకు తలాడించాడు.
ఎలా మొదలు పెట్టాలో తెలీక కాస్త తటపటాయించాక అప్పుడు మొదలు పెట్టాడు.
“ఈ మధ్య చదువుకున్న పిల్లలు లక్షల్లో జీతాలు తీసుకునే పిల్లలు కొంతమంది వ్యవసాయం పైన దృష్టి పెట్టారు. చక్కగా సాగు చేస్తున్నారు. దిగుబడిలో లాభాలు కూడా చూపిస్తున్నారు.” అంటూ ఆగాడు
కొడుకుకి సగం అర్థం అయింది సగం అర్థం కాలేదు. “హమ్! అయితే?”
“అలాటి కుర్రోళ్లంతా రైతు సదస్సుల పేరిట ఒక అవగాహనా సభలను రాష్ట్రం అంతా నిర్వహిస్తున్నారు. ఈ పండక్కి ఆ సదస్సు మన ఊరిలో పెడుతున్నారు”
“మంచిది. మీరు వెళ్లి రండి, దానికి వీడు ఎందుకు?”
“వీడు వస్తే బాగుంటుంది.”
“ఎందుకు వీడేమన్నా వ్యవసాయం చెయ్యాలా? చేయడానికి మనకి భూమి ఎక్కడ ఉంది? ఆ సభలకి వీడు ఎందుకు? బోర్ ఫీల్ అవుతాడు”
“నువ్వు వాడి మెడ  మీద కత్తి పెట్టి ఫస్ట్ రాంక్ తెచ్చుకుంటావా లేదా అని అడిగినట్టు నేనేమి వాడిని వ్యవసాయం చెయ్యమని నిర్బందించను. వాడి తాత  ఏమి చేసేవాడో వాడికి నామ మాత్రంగానైనా
తెలిస్తే చాలు.  ఒక్కగానొక్క మనవడు.  వాడికి మా జీవితాల గురుంచి నాలుగు కబుర్లు, మా వొళ్ళోూపెట్టుకుని మంచి కధలు చెప్పి సేద తీరుదామనే ఆశే తప్ప ఇంకేమి లేదు.”
“నువ్వు చెప్పే ఆ కబుర్లు కథలు అన్ని CD ఫార్మటు లోకి వచ్చేసాయి నాన్నా.  అవి వాడు రోజు చూస్తూనే ఉంటాడు”
“కథలు వచ్చి ఉండవచ్చు, కానీ జీవితాలు వచ్చి ఉండవ్ కదా. వాడ్ని పుట్టించిన వాడినే  పుట్టించిన వాడిని, 60 ఏళ్ళు పైబడి బతుకున్న వాడిని, నా జీవితం, నా అనుభవాలు, నా ఒడిదుడుకులు,నా కష్టాలు, నా విజయాలు ఇవన్నీ వాడితో పంచుకునే హక్కు నాకు ఉందా లేదా?”
“ఏమిటి నాన్న నీ కథలు, కష్టాలు? నేను చెప్పనా? ఒకే ఒక్క కథలో నీ జీవితం మొత్తం నేను చెప్పనా?
“అనగనగ ఒక రైతు, ఆ రైతుకి 10 ఎకరాల పొలం. నడి  వయస్కుడు అయ్యేవరకు బాగా బతికాడు, ఆ తర్వాత పరిస్థితుల్లో  మార్పు, పర్యావరణం లో మార్పు, వ్యాపార దృఖ్పదాలలో మార్పు, ప్రభుత్వాలలోమార్పు,  ప్రజల ఆహార నియమాలతో మార్పు. ఇలాంటి పరిస్థితుల్లో  ఒక ఏట విత్తనాలు తెచ్చి పొలం అంతా  చల్లి, దుక్కి దున్ని , నీరు పట్టి, పురుగుమందు కొట్టి, దిష్టి బొమ్మలు పెట్టి, తీరా పంట చేతికొచ్చే ముందే  ఎండి పోతే.. ఏమిచేయాలో తెలీక, పంటా పంటా ఎందుకు ఎండిపోయావ్ అని అడిగితే, నాకేం తెలుసు నాకు వాడిన పురుగుల  మందులను అడుగు అన్నదట,పురుగుల మందు పురుగుల మందు
ఎందుకు పని  చెయ్యలేదుఅంటే, నాకేం తెలుసు, నువ్వు వాడిన  విత్తులను అడగమందిట, విత్తనం, విత్తనం పూర్తిగా  ఎందుకు మొలకెత్తలేదు అంటే, నాకేం తెలుసు నను నాటిన నేలని అడుగు అన్నదట,
నెల నెల ఎందుకు విత్తనాన్ని మొలకెత్తనీయలేదు అని అడిగితే, నాకేం తెలుసు నాలో ఉన్న సారాన్ని అడుగు అన్నదట, సారం సారం ఎందుకు ఇలా చేసావ్ అని అడిగితే నాకేం తెలుసు, ఈ ఏడు కురిసిన వానని అడుగు అన్నదట, వాన వాన పూర్తిగా ఎందుకు కురవలేదు అంటే, నాకేం తెలుసు నన్ను కురిపించే  ప్రకృతిని అడుగు  అన్నదట,  ప్రకృతి  ప్రకృతి  ఎందుకు సరిగా వానలు కురిపించలేదు అంటే, ఏటా కనీస వర్షపాతానికి
కావలసిన అడవులనైనా ఉంచకుండా, చెట్లను నరికి వాటి సమాధులపై బహుళ అంతస్తుల భవనాల పునాదులు లేపుతూ,  అన్నాన్ని  మరిచిపోయి  పిజ్జా  బర్గర్లకు అలవాటు పడిపోతున్న జాతికి నేను మళ్ళి
కడుపు నిండా అన్నం పెడతాను అంటే, నీ కడుపు కొట్టకుండా ఎలా ఉంటాను అని ప్రశ్నించిందిట.  ఉందా నాన్న సమాధానం నీ దగ్గర?  లేకనేగా  అప్పులకి కొంత, అవసరాలకి కొంత, నన్ను చదివించటానికి కొంత
ఇలా ఉన్న భూమి అంతా అమ్ముకుని, తోటి చనిపోయిన రైతు కుటుంబాలను ఓదారుస్తూ, నష్టపోయిన రైతులను వెనకేసుకొని వస్తూ, నీ భూమిని నువ్వే కౌలుకి తెచ్చుకుని వ్యవసాయం పేరిట కాలక్షేపం చేస్తూ
బతుకు ఈడుస్తున్నావు. ఇదేగా నీ కధ”
కొడుకు  కధకి ఇంట్లో అందరికి కన్నీళ్లు తిరిగాయి. తండ్రికి ఇంకా ఏ  వాదనా
మిగల్లేదు. కళ్ళ  నీళ్లు తుడుచుకుంటూ నిలబడిపోయాడు. అప్పటి దాకా వీళ్ళ వాదన వింటున్న మనవడు కదిలాడు.
“నాన్నా! నేను తాతతో వూరు వెళ్తున్నా.  పండగ అయ్యేదాకా అక్కడే ఉంటా. ప్లీజ్ ఒప్పుకో. నువ్వు నన్ను ప్రతీసారి  ఫస్ట్ రాంక్ తెచ్చుకో ఇది కొంటాను, అది చేస్తాను అంటుంటావ్ గా. ఇప్పుడు నేను చెబుతున్నా
నన్ను ఊరు పంపించు ఫైనల్ ఎగ్జామ్స్ నేనే కష్టపడి ఫస్ట్ రాంక్ తెచ్చుకుంటా. లేదంటే నీ ఇష్టం” అని ముగించాడు
 మనవడుమాటలు విని తాత  కళ్ళు విప్పారాయి, కొడుకు భృకుటి ముడి పడింది. కొంత సేపు నిశ్శబ్దం తర్వాత  ఇక  చేసేది ఏమి లేక భార్యని,  కొడుకుని తండ్రితో ఊరు పంపటానికి ఒప్పుకున్నాడు.
raithu
                                                                               *********************

వాళ్ళ ముగ్గురుని బస్సు ఎక్కించి మనవడికి కొడుకు “అల్లరి చెయ్యొద్దు బుద్ధిగా ఉండు, అందరిని పలకరించు” అని నాలుగు మాటలు చెబుతున్నాడు. ఇంతలో వృద్ధుడు కలుగచేసుకుని “మీ సెక్యూరిటీ వాడు నన్ను ఆపాడు  అన్న కోపమేమి నాకు లేదురా.. చిన్న అయోమయం అంతే.. మా తరం లో ఒక మనిషి ఎదగటం అంటే చుట్టూ ఉన్న మరో నలుగురు మనుషులకి మరింత దగ్గర అవ్వటం అనే నాకు తెలుసు. ఈ తరం లో ఎదగటం అంటే అయినవాళ్ళకి కూడా అందకుండా అందలం ఎక్కి కూర్చోవటం అని నువ్వే చెప్పావుగా..  అయినా తప్పు నాది. నేను నాటిన విత్తు ఒకటి, కానీ మొలకెత్తాలని ఆశించేది ఇంకోటి. అర్ధం చేసుకుంటాలే.. కానీ ఒక్క విషయం నువ్వే ఆలోచించు..  నలుగురిని కలుపుకుంటూ విశాలంగా ఎదగటం ఎదగాటమా? లేక  ఎవ్వరికి  అందనంత ఎత్తు నిలువుగా ఎదగటం ఎదగాటమా? ఏది నిజమైన ఎదుగుదల? ఏది స్వచ్ఛమైన గెలుపు? నువ్వే ఆలోచించు” అని అన్నాడు. వృద్ధుని మాటలకి కొడుకు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో బస్సు కదిలింది.

నాలుగు రోజులు ఏకాంతంగా గడిపే సరికి కొడుకు మస్తిష్కములో తండ్రి నాటిన ప్రశ్నల విత్తనాలకు ఆలోచనల అంటు  దొరికి, సమయం అనే నీరు తాకి   అవి అతని మెదడంతా వ్యాపించి సాగాయి. ఏమిటి తనలో లోపం? చిన్నపాటి నుండి ఇది నాన్న నాటిన భావజాలమే కదా. వ్యవసాయం కలిసి రాలేదు అన్నాడు. నన్ను దానికి దూరంగా పెంచాడు.  ఆయన  కోరిక మీదనేఈ  రోజు తాని ఈ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళి నాన్నే  వచ్చి విమర్శిస్తే, ఇంక  తాను ఎవరితో చెప్పుకోవాలి అని మదనపడసాగాడు.   ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి అంటే తాను కూడా పండక్కి ఊరు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఉన్న ఫ్రీ టైం కూడా ఆఫీస్ వర్క్ కి వాడుకుని, సంక్రాతి  సెలవు దినానికి భోగి రోజున లీవ్ పెట్టుకుని ఆఖరి నిముషంలో డబుల్ ఛార్జ్ తో టికెట్ కొనుక్కుని ఊరు బయలుదేరాడు.

 

                                                       *********************
 దాదాపు మూడేళ్లు  ఏళ్ళు అయిందేమో అతడు ఆ ఊరిలో అడుగు పెట్టి, ఊరేం పెద్దగా మారలేదు. ఆ వీధుల్లో నడిచి వెళ్తుంటే అక్కడక్కడా తెల్లవారు జామున వేసిన భోగి మంట  తాలూకు జ్ఞ్యాపకంలా  బూడిద రాసులు కనిపిస్తున్నాయి. కొన్ని భోగి మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి.  తనని చూసిన వారు అందరూ ఎవరి తాలుకాన అని ఆరాలు మొదలు పెట్టారు. ఒకరిద్దరు అయితే గుర్తుపట్టి పలకరించారు కూడా. అలా మెల్లిగా రామాలయం వీధిలోకి వెళ్ళగానే రోడ్డు పొడుగునా  రంగు రంగుల రంగవల్లులు, నిన్న ఇక్కడ ముగ్గుల పోటీ జరిగింది అని అర్ధం అవుతూనే ఉంది. ఆ ముగ్గులన్ని చూసుకుంటూ, వీధులన్నీ దాటుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. గుమ్మంలో కొడుకుని చూడగానే అమ్మ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపొయింది. మనసారా అతడిని హత్తుకుంది. వలస పక్షి తన సొంత గూటికి చేరుకున్న అనుభూతి కలిగింది అతడికి. అమ్మా, నాన్నా తన ఇంటికి రావటానికి, తాను అమ్మా, నాన్నల ఇంటికి రావటానికి తేడా తెలిసింది అతడికి.  అమ్మే అతడికి స్వయంగా తలంటు పోసింది.
“ఏమిటిరా ఈ జుట్టు, పట్నంలో నీ తలని పట్టించుకునే వారు కూడా లేరా?” అంటూ కోడలి వైపు చూసింది.
“ఏమిచెయ్యమంటారు అత్తయ్యా! ఎంత ప్రయత్నించినా అయన కాళ్లే దొరుకున్నాయి తప్ప అయన జుట్టు నాకు దొరకటం లేదు” అంటూ గడుసుగా సమాధానం చెప్పింది.  ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు.
స్నానం, ఫలహారం ముగించిన తర్వాత అడిగాడు “తాత మనవళ్లు ఎక్కడా” అని.
“ఊరిలో ఏదో రైతు సదస్సు జరుగుతోంది కదా! అక్కడికి వెళ్లారు” అని బదులిచ్చింది.
అతడు కూడా అడ్రస్ కనుక్కుని అక్కడికే బయలుదేరాడు.  రైతు సదస్సు అంటే ఏదో పది మంది చేరే రచ్చబండలా ఉంటుంది అనుకున్నాడు. కానీ తీరా అక్కడికి
వెళ్ళి చూసే సరికి అతడికి నిజంగా ఆశ్చ్యర్యం వేసింది. ఒక స్కూల్ గ్రౌండ్ నిండా పట్టే  జనం. స్టేజి మీద మైకులు గ్రౌండ్ లో స్పీకర్ బాక్సులు, స్తంభాలకి అరటి చెట్టు  తోరణాలు, శ్యామియానాలు, ఫ్లెక్సీలు ఒకటేమిటి ఆ వూరిలో వ్యవసాయంతో సంబధం ఉన్న ప్రతీ ఇంటి నుండి సాధ్యమైనంత ఎక్కువ జనం వచ్చారు. ఆ జనం లో తనతండ్రి, కొడుకు ఎక్కడున్నారో వెతికే లోపుల, స్టేజి మీద ఒక యువకుడు మాట్లాడటానికి సన్నద్ధం అవుతున్నాడు. ఆ యువకుడిని ఎక్కడో చూసానే అనుకునేంతలో తనని తానె పరిచయం చేసుకున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్. లక్షల ప్యాకేజీ వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని, నాలుగేళ్ళ క్రితం వ్యవసాయం లోకి
దిగి, ఏటేటా లాభాలు గడిస్తూ వ్యవసాయం చేస్తూ లాస్ట్ ఇయర్ ఉత్తమ రైతు అవార్డుతో పాటు మరెన్నో అవార్డ్స్ లను రాష్ట్ర స్థాయిలోను కేంద్ర  స్థాయిలోను
గెలుచుకుని గూగుల్ లోను, ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను  బాగా పాపులర్ అయిన వ్యక్తి. అతడి ఇంటర్వ్యూలు కొన్ని తాను చూసాడు కూడా.
అటువంటి వ్యక్తి ఈ రోజు మన ఊరికి వచ్చి ఇలాంటి సదస్సు నిర్వహిస్తున్నాడంటే, ఇదేదో ఖచ్చితంగా  వినాల్సిందే అని అక్కడే ఎంట్రన్సులో నిలబడి ఉపన్యాసాన్ని వినసాగాడు.
“రైతన్నలకి, రైతు సంబంధీకులకు అందరికి నా నమస్కారాలు, భోగి మరియు సంక్రాతి పండగ శుభకాంక్షలు. మీ అందరికి ఒక చిన్న సూటి ప్రశ్న.
అసలు మనకి, వ్యవసాయం ఏమిటి?”
ఆ ప్రశ్న అర్ధం కాక అందరు ఒకరివంక ఒకరు చూసుకున్నారు.
“చాల చిన్న ప్రశ్న. వ్యవసాయం మనకి ఏమిటి?”
అయోమయంలో నుండి తేరుకుని ఒక్కొక్కరే సమాధానం ఇవ్వటం మొదలు పెట్టారు.
“మన వృత్తి బాబు”
“మన బతుకు తెరువు బాబు”
“మన జీవన ఆధారం అబ్బీ”
ఇంకా ఇలాంటి సమాధానాలు చాలానే వచ్చాయి.
“మీరు చెప్పినవి అన్ని కరెక్టే.నేను ఇంకా కొంచెం ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ చెబుతాను వినండి. వ్యవసాయం మనకి…”
అతడు చెప్పబోయే సమాధానం కోసం అంత ఆత్రంగా ఎదురు చూడసాగారు..
“వ్యవసాయం మనకి వ్యసనం” అని సమాధానమిచ్చాడు
ఆ సమాధానం విని చాల మంది మౌనంగా  ఉండిపోయారు. మరికొందరు తమలో తాము గొణుక్కో సాగారు.
“వ్యసనమని ఎందుకు అంటున్నాను అంటే, తన వ్యసనం కోసం భార్య మెళ్ళో తాళిని కూడా తాకట్టు పెట్టేవారు మనదేశంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు. ఒకటి
తాగుబోతు, రెండు రైతు” అని తీర్మానించాడు
అక్కడున్న చాల మంది రైతులు చిన్నబుచ్చుకున్నారు. ఒకళ్ళిద్దరు ఆవేశంగా కండువా దులుపుకుని లేవటానికి కూడా సిద్ధం అయ్యారు.
“ఆగండి. ఆవేశ పడకండి.  చెప్పేది  పూర్తిగా వినండి. కూర్చోండి.  మన పెద్దలు చెబుతారు వ్యసనం రెండు రకాలు అని. ఒకటి చెడ్డ వ్యసనం, మన బతుకుని
దిగజార్చేది, లైక్  స్మోకింగ్, డ్రింకింగ్… రెండోది మన బతుకుల్ని బాగు చేసేది, లైక్ మార్నింగ్ వాక్, రీడింగ్ బుక్స్ లాంటివి అన్నమాట.  ఈ రెండు కాక మూడో
రకం  వ్యసనం ఒకటి ఉంది.   మనకి కాస్త ఏ మాత్రం అవకాశం దొరికినా, ఏ మాత్రం  కాస్త ఊతం దొరికినా చుట్టూ పక్కల వాళ్ళు తినటానికి కాస్త ధాన్యం పండిద్దాం
అని  ఆరాటపడటం..”
జనాలు కొంచెం సమాధానపడ్డారు. అతడు కొనసాగించాడు.
“పంటకి రుణాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, సకాలంలో వర్షాలు పడినా పడక పోయినా, దళారీలు గిట్టుబాటు ధర ఇచ్చిన ఇవ్వక పోయినా, మనకంటూ
కొంచెం భూమీ ఉంటె ఏదో ఒక పంట వేసి సాగు చేసి నలుగురి కడుపుకి అన్నం పెడదాం అని చూసే మనకీ,  వ్యవసాయం  వ్యసనమా? కాదా?”
అవును అన్నట్లుగా కొంతమంది తలాడించారు. అతడు గొంతు కొంత పెంచి కొనసాగించాడు.
“మనం అంటే పేదవాళ్లం, వేరే ఏమి చేతగాని వాళ్ళం, ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుని, ఇంకా అవసరం అనుకుంటే వ్యాపార ప్రకటనల ద్వారా
కూడా కోట్లు సంపాదించుకునే వీలు ఉన్నా కుడా, అవి వద్దు అనుకుని, తనకున్న పొలం లో కాళీ సమయాల్లో వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తున్నాడు
హీరో పవన్ కళ్యాణ్.  సో  వ్యవసాయం ఒక వ్యసనం అవునా కాదా?”
మరికొంతమంది అవును అన్నట్టుగా తలా ఊపారు. అతడు గొంతు తారాస్థాయికి పెంచి ఆవేశంగా అడిగాడు.
“వ్యవసాయానికి ఇవి రోజులు కావు, మీ భూములు మాకు ఇవ్వండి, మేము ఇక్కడ విమాన ఆశ్రయాలు కడతాం, కార్ల ఫ్యాక్టరీలు పెడతాం , సింగపూర్ లాంటి రాజధానులు నిర్మిస్తాం,  ఫలితంగా  మీకు మంచి డబ్బు సదుపాయాలు కలిపిస్తాం అని ప్రభుత్వాలే ముందుకి వచ్చి మన భూములని అడిగినా, చావనైనా 
చస్తాం  గాని మా భూములు  మాత్రం ఇవ్వం అని రోడ్లెక్కి ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తింటున్నాం అంటే, 
మనకి వ్యవసాయం ఒక భయంకరమైన వ్యసనం అవునా? కాదా?…. 
అతడు ఎంత బిగ్గరగా ఈ మాట అడిగాడు అంటే ఊరిజనం అంత ఒకసారి తలలు ఆ సభ జరుగుతున్న స్కూల్ వైపుకి తిప్పి చూసారు. ఆడిటోరియం అంతా నిశ్శబ్దం అలముకుంది. అతడు అడిగిన ప్రశ్న అందరి మెదళ్లలోనూ ప్రతి ధ్వనిస్తోంది. ఆడిటోరియం మొత్తం ఒకే మూడ్ సెట్ అయింది. ఇంకా అతడి ప్రసంగం పూర్తి అయ్యేవరకు ఎవరు డైవర్ట్  కారు అని నిశ్చయించుకున్నాక అతడు తన  అసలు ప్రసంగంలోకి ప్రవేశించాడు.
“అయితే ఈ వ్యసనాన్ని మనల్ని బలి  కోరే స్థాయి నుండి మన చుటూ ఉన్నవాళ్ళ అందరి బాగు కోరే స్థాయికి తీసుకురావటం ఈ రోజు మనందరి బాధ్యత.”
“ఈ దేశం లో వ్యవసాయ రంగం ఒక సమాంతర ఆర్ధిక వ్యవస్థ. వ్యవసాయం పై వచ్చే ఆదాయానికి ఈ దేశం లో పన్ను లేదు, ఈ దేశం లో రైతే  రాజు, 
ఈ దేశానికి రైతు వెన్నుముక, ఏ ప్రభుత్వం అయినా మాది రైతు ప్రభుత్వమే, రైతులకి మేము చేసినంత ఇంకెవ్వరు చెయ్యలేదు అని చెప్పుకునేవే, ఇలా ఎన్నో ఎన్నెన్నో, కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి. ఈ దేశంలో  ప్రతీ అరగంటకో  రైతు ఆత్మహత్య. రైతు ఆత్మహత్యలతో తెలుగు రాష్ట్రాలవి 2 మరియు 6వ స్థానాలు.  ఇది మన దుస్థితి “
“వ్యవసాయ రంగంలో అడుగడుగునా ఆటంకాలే, కాదనను  కానీ మనసు పెట్టి చూస్తే ప్రతీదానికి ఒక  ప్రత్యామ్నాయం  ఉంటుంది, ఒక్క పోయిన మనిషి ప్రాణానికి తప్ప. మనముందు అనేక సమస్యలు ఉన్నాయి, నీటి ఎద్దడి, కల్తీ విత్తనాలు, అశాస్త్రీయ విధానాలు, వర్షా భావం, సమయానికి రుణాలు అందకపోవటం లేదా రుణాలు తీర్చలేకపోవటం, అన్నింటికీ మించి  రైతుల ఆత్మహత్యలు. ఒక పంట పోతే మరో పంట, ఒక విత్తనం మొలకెత్తకపోతే మరో రకం, ఈ ఏడు ఋణం తీర్చలేకపోతే వచ్చే ఏడు, కానీ ఒక రైతు ప్రాణం పోతే మాత్రం…….. ” అంటూ కాస్త నిశ్శబ్దానికి చోటు ఇచ్చాడు. సభలో రైతులందరూ ఒక్కసారిగా బిగ్గరగా ఊపిరి
పీల్చుకున్నారు.  కొంతమంది చనిపోయిన తమ నేస్తాలని గుర్తు తెచ్చ్చుకుని కంట నీరు పెట్టుకున్నారు…
” సో, ఈనాటి మన సభలో ఆత్మహత్యలు ఆగడానికి మార్గాలు అన్వేషించడం ద్వారా మన ప్రయాణం మొదలు పెట్టి, ముందు ముందు ఇంకా అనేక అనేక సమస్యలకి పరిష్కార మార్గాలను అంచెలంచెలుగా  అనేక సభల ద్వారా మనం తెలుసుకుందాం.”
“ఆత్మహత్య అనేది మనకున్న తాత్కాలిక సమస్యలకి మనమిచ్చే శాశ్వత పరిష్కారం” 
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మనిషిని ఒక్క 10 నిముషాలు డైవర్ట్ చెయ్యాగలిగితే అతడు ఆ ఆలోచనలు విరమించుకోవటానికి 90% అవకాశాలు
ఉన్నాయి అన్నది అనేక మానసిక శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. సో ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ 10 నిముషాలు రైతుని ఎలా డైవర్ట్ చెయ్యటం అనే దాని మీద
పెడదాం.  సాధారణంగా 90% రైతు ఆత్మహత్యలకు కారణం ఆర్ధికంగా చితికిపోవటం, తీర్చలేని అప్పుల్లో కూరుకుపోవడం. ఈ పరిస్థితి ఎందుకు అంటే తీసుకున్న
రుణాలు వేళకి చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోవటం, పంట నాశనం అయింది కరువు భృతి ఇప్పించండి అని అడగటానికి కూడా లంచాలు ఇవ్వాల్సి రావటం, కరువు ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కూడా కేంద్రం దర్యాప్తుకి రావటం, పరిశీలించటం, నివేదిక పంపటం, ఆ నివేదికని చదివి కరువు ప్రాంతంగా ప్రకటించి కూడా అరా కోరా నిధులు మంజూరుచేయ్యటం, ఆ నిధులు కేంద్రం నుండి బయలుదేరి రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి, మండలాలు దాటి, రైతు గ్రామాలూ చేరేసరికి చాల భాగం
ఆవిరి అయిపోవటం, చివరికి రైతు చేతికి అందేసరికి  వచ్చిన నిధుల కన్నా పెరిగిన వడ్డీ అధికంగా ఉండటం, ఇన్నాళ్ల ఆరాటం, పంట భీమా కోసంపోరాటం అన్ని
వృధా అని నిరాశ చెందిన రైతుకి ఇంత మొద్దుబారిన వ్యవస్థని పట్టుకుని వేలాడటం కన్నా ఉరి వేసుకుని చెట్టుకు వేలాడటమే సులభం అనిపించించటంలో తప్పేముంది.”
అవును అన్నట్టుగా తలా ఊపారు అక్కడున్న రైతులంతా…
“కానీ.. ఆలా అని ఆత్మహత్య చేసుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటారా… 
1. ఒక రైతు ఆత్మహత్య వంద మంది రైతుల ఆత్మస్త్యైర్యాన్ని దెబ్బతీసిస్తుంది… 
2. ఒక రైతు ఆత్మహత్య సాగు భూమిని నిస్సారంగా పడిఉండేలా చేస్తుంది….  
3. ఒక రైతు ఆత్మహత్య పండంటి ఇల్లాలిని దొరల దగ్గర బనిసగా బతికేలా చేస్తుంది…. 
4. ఒక రైతు ఆత్మహత్య ఒక కొడుకుని రేపటి పౌరిడిని కనీయకుండా నేటి బాల కార్మికుడుగానే చిదిమేస్తుంది..
5. ఒక రైతు ఆత్మహత్య ఒక కూతురుని….   అతడు వాక్యం ముగించే లోపే బాధ గొంతుకి, కన్నీళ్లు కళ్ళకి అడ్డుపడ్డాయి….. 
సభలోని రైతులంతా ఒక్కసారి కళ్ళు మూసుకుని తమ తమ కుటుంబాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. పిల్లలు పక్కనే ఉన్నవాళ్లు ఒక్కసారి వాళ్ళని
గట్టిగ హత్తుకుని నుదుటునా ముద్దు పెట్టుకున్నారు. సభలో చిన్న అలికిడి, మళ్ళి  తిరిగి మౌనం.  అంతా కుదురుకున్నాక అతడు మల్లి మొదలు పెట్టాడు.
 “సరిగ్గా ఇక్కడే మనంకొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి, మన ఆర్ధిక వనరులని మనం పరిపుష్టం చేసుకోవాలి, ఏ కారణలుచేతనైనా పంట కోల్పోయిన రైతుకి
ఆర్ధిక సాయం వెంటనే అందించాలి. అందుకు గాను మనం పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన ఆర్ధిక వనరులు మనమే సమకూర్చుకోవాలి. ప్రతీ పల్లె లోను  అట్టడుగు స్థాయి రైతులని సభ్యులుగా  ఎన్నుకుని ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఆ అకౌంట్ కి విరాళాలు జనం నుండి సేకరిద్దాం. పంట నష్టపోయిన
రైతుకి ప్రభుత్వ సాయం అందేదాకా కావాల్సిన డబ్బుని ఈ అకౌంట్ నుండే చెల్లిద్దాం. దీనిపై ఏ మాత్రం వడ్డీ ఉండదు. కానీ డబ్బు తీసుకున్న రైతు తన స్థితి
మెరుగు పడ్డాక, ఏకంగా గాని, కొద్ది కొద్దిగా గాని డబ్బు వాపసు ఇవ్వొచ్చు. ఏమంటారు?”
సభలో నుండి ఒక రైతు లేచి
“తాను  మింగ మెతుకు లేదుగాని మీసాలకి సంపెంగ న్నూనే అన్నాట్ట,  ఇల్లు గడవటమే కష్టంగా ఉంటె, ఊరికి విరాళాలు ఎక్కడనుండి వస్తాయి బాబు?”
మాది అదే ప్రశ్న అన్నట్టుగా చూసారు రైతులంతా…
“విరాళాలు మనమివ్వక్కరలేదు అన్నా! ఇచ్చేవారు వేరే ఉన్నారు. చెబుతా విను. ఇందాక అనుకున్నాం కదా వ్యవసాయం సమాంతర ఆర్ధిక వ్యవస్థ, ఈ రంగం  లో ఆదాయానికి పన్ను లేదు అని. ఆ అవకాశాన్ని వాడుకుని వందల ఎకరాలను సాగు చేస్తూ, బినామీలతో భూములను పంటలకు వాడుకుంటూ కోటీశ్వరులు
అయినా రైతులు కూడా మన వ్యవస్థలోనే ఉన్నారు.  వాళ్ళతో మనం సమన్వయము అవుదాం. వ్యవసాయం అంటే వ్యాపారం కాదు వ్యవస్థకి మనం చేసే సాయమే వ్యవసాయం అని చెబుదాం. సాటి సన్నకారు రైతులని ఆదుకోమని ప్రాధేయపడదాం. తప్పకుండ మంచి విరాళాలు వస్తాయి.  ఇంకా మన పిల్లలు, బంధువుల పిల్లలు పట్టణాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు కదా, వాళ్ళని కూడా నెలకి ఇంతని ఇమ్మని అడుగుదాం. అంతా ఏకమై తలా ఒక చెయ్యి వేస్తే ముందు
ఈ  ఆత్నహాత్యలు ఆగుతాయి.”
ఈ మాటలు సూటిగా సభ ఎంట్రన్స్ లో నిలబడి ప్రసంగం వింటున్న అతడికి తాకాయి. నిజమే కదా అనుకున్నాడు. ఇంతలోఒక రైతు
“అంతా ప్రయాస కానీ క్రమంతప్పకుండా ఆల్లు మాత్రం ఎన్నాళ్ళు ఇస్తారు బాబు” అని అడిగాడు
“ఎందుకు ఇవ్వరు తాత. తప్పకుండ  ఇస్తారు. మనం కాస్త మోటివేట్ చెయ్యాలి అంతే.  అయ్యా! నాగరీకులు, మీకు జీవితం లో ఒక డాక్టర్ అవసరమో, ఒక ఇంజనీర్ అవసరంమో అప్పుడప్పుడు కలుగుతుంది. కానీ ఒకరైతు అవసరం మాత్రం రోజుకి మూడు సార్లు కావలి, మీరు తినే తిండికి అని ఊరూరా
చాటుదాం. పొద్దున్న ఇడ్లి, మధ్యాన్నం అన్నం, రాత్రి చెపాతి తినే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా సరే మన పిలుపుకి స్పందించాల్సిందే. మనకి వెన్నుదన్నుగా
నిలవాల్సిందే”.
చాలా మంది కన్విన్స్ అయినట్టే తలాడించారు. కానీ కొంత మందికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక రైతు లేచి
“చూడు బాబు. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం, మీకు తీరిక ఉన్నప్పుడు కాటు అంటే ఇంకా ఎవడు మాత్రం వ్యవసాయం చేస్తాడు బాబు? అందరూ ఆ డబ్బు
కోసమే ఎగబడరా?”
“మంచి ప్రశ్న అడిగావు బాబాయ్! అందుకే ఈ డబ్బు పొందటం అనేది ఆఖరి ఆప్షన్గా  పెట్టుకున్నాం.  ఒక పంట పండించడం కోసం ఒక రైతు ఎంత తాపత్రయం పడతాడో అంతా  పడాల్సిందే.  తీరా ఇంత కష్టపడ్డాక అటు పంట చేతికి రాక, ఇటు ప్రభుత్వ సాయం చేతికి రాక నడిమిట్ల కొట్టాడే రైతులు ఉంటారు కథా. వాళ్ళకి
ఉరి తాడు శరణ్యం కాకూడదు అని అలోచించి ఈ పధకం పెట్టినం. అంటే డెడ్ ఎండ్ కి బదులుగా యూ టర్న్ అన్నమాట. కనీసం ప్ర్రాణమైనా మిగులుతాది కదా.
అంతే కాకుండా ఈ పధకం ఏ వూరికి ఆ వూరే విడి విడిగా  ప్రవేశపెట్టినం.  ఇప్పుడు నువ్వే బ్యాంకు అకౌంట్ కి జవాబుదారిగా ఉన్నవ్, మీ ఉరిలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ రైతు ఏ పంట వేసి ఎంత నష్టపోయినాడో నీకు తెలియదా? ఒకవేళ తెలీక పోయిన కనుక్కోనుడు యెంత సేపు? ఆలా  పొలాలమ్మట పోయి వస్తే తెలుస్తాది. ఎవరెంత తీసుకున్నారు, ఎవరెంత తిరిగి ఇచ్చారు, నెల నెల ఎంత విరాళాలు వచ్చాయి ఖాళీ ఈ విషయాలు చూసుకుంటే చాలు. అయినా కుడా నువ్వన్నట్టుగా ఎవరైనా రైతు మాయ చేసి ఈ అకౌంట్ల డబ్బులు తీసుకున్నాడు అని తెలిసింది అనుకో, వాని పేరు రైతుల జాబితా లోనుండి తీసి రాజకీయ నాయకుల జాబితాలో వేస్తాం, ఖతం.” అని ముగించాడు
జోక్ అర్ధం అయినవాళ్లు పెద్దగా నవ్వుకున్నారు. జోక్ అర్ధం కాకపోయినా కాన్సెప్ట్ అర్ధం అయినవాళ్లు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.
“విషయం అందరికి అర్ధం అయినట్టేనా?అని బిగ్గరగా అడిగాడు”
అందరూ అయిందని తలాడించారు. బ్యాంకు అకౌంట్ చూసుకునే సభ్యులు ఎవరో మీరే ఎన్నుకోండి. నేను నా వంతుగా 10,000/- ఇస్తున్నా. ఇప్పటినుండే
విరాళాలు సేకరించటం మొదలు పెట్టండి. మన లక్ష్యం రైతుల ఆత్మహత్యలు ఆపటం. మర్చిపోకండి. సభ ముగుంచేఉందు కొన్ని సూచనలు. అంతావినండి.
“వ్యవసాయా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్లినా నాలుగైదు ఏళ్ళు పడుతుంది. అంత వరకు మనంకొన్ని ప్రాధమిక అంశాలు దృష్టిలో పెట్టుకుందాం. నదుల అనుసంధానం కన్నా, ఎత్తిపోతల పధకాల కన్నా, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు కన్నా వర్షాధారిత
వ్యవసాయమే రైతుకి, భూమికి, ప్రకృతికి సమస్త జీవరాశికి కూడా మంచిది. ఈ విషయం మనం నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకుందాం. అయితే అంతవరకు
ప్రతీ ఒక్కరూ కూడా ఒక్కో మొక్కని  చెట్టు  అయ్యే వరకు పెంచుతాయని ప్రతిజ్ఞ పూనండి. అటవీ సంపదని పెంచండి. వర్షపాతం ఏటా పెరిగేలా చెయ్యండి.
ఇంకా వ్యవసాయం ఒక కళ,  ఒక నైపుణ్యం, అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అయినా కూడా రైతు విద్యావంతుడు అయితే ఆ ప్రయోజనాలు వేరు. సో మన తర్వాతి తరం వారిని దీనికి  దూరంగా పెంచకుండా, వాలు కూడా ఈ రంగం పట్ల ఆకర్షితులు అయ్యేలా చెయ్యాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే. ఏ రోజు వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ అని చేసే ప్రతీవాడూ డబ్బు కోసమే, పేరు కోసమో, పేటెంట్ల కోసమే చేతున్నట్టే ఉంది తప్ప నిజంగా ఒక అట్టడుగు స్థాయి రైతుకి మౌలికంగా పనికొచ్చే విష్యం ఒక్కటంటే ఒక్కటి కూడా కనుగొనబడలేదు. సో అందుకే మన పిల్లలని ఆ దిశగా చదివించుకో గలిగితే
ఎమో, మనలోనే ఒకడు తక్కువ సాగులో అధిక దిగుబడులిచ్చే కొత్త శాస్తీయ విధానాలు కనిపెట్టొచ్చు, ఒక బస్తాడు విత్తనాలో గుప్పెడు విత్తనాలు పరిశీలించి
అవి అసలువో కల్తీవో ముందే కొనుగోనచ్చు, ఇలా ఎన్నో ఎన్నెన్నో మనసు పెడితే భవిత మనదే. సో, వ్యవసాయాన్ని వారసత్వ సంపదగా కూడా గుర్తుంచి
ముందు చూపుతో మెలిగితే అంత మంచే జరుగుతుంది. సభకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ మొక్కలు పంచుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కో మొక్క, ప్రతీ
మొక్క చెట్టు అయ్యయెవరకు గుర్తు ఉందిగా..  అందరూ ఒక్కసారి గట్టిగ అనండి  జై కిసాన్…  జై జై కిసాన్….   సెలవు”.  అంటూ నమస్కారం పెట్టి వేదిక దిగిపోయాడు.
***********************
ఎంట్రన్స్ లో నిలబడి ఈ మాటలు వింటున్న కొడుకుకి తన తండ్రి ఆలోచన, మనసు  పూర్తిగా అర్ధం అయ్యింది. తనజీవితంలో మరో గురుతర భాద్యత భుజాలకి
ఎత్తుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని అతడికి అర్థం అయింది. రైతులందరూ మొక్కలు తీసుకుని బయటకి వస్తుండగా ఆ గుంపు లోంచి మెల్లగా వస్తున్నారు తాత మనవళ్లు. తన కొడుకు డ్రెస్సింగ్ చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తెల్లటి చేనేత పంచె కట్టు, తెల్లటి చొక్కా మీద కండువా..
నాన్న అంటూ వచ్చి తండ్రిని హత్తుకున్నాడు. మోకాలి మీదకి వంగి కొడుకుని గుండెలకి హత్తుకుని,
“నాకు నీ వయసు ఉన్నపుడు మా నాన్న 10 ఎకరాల ఆసామి. పంట కాలం అంతా పొలాల్లో, బురదల్లో పని చేసి, పంట పండించి సంక్రాతి నాటికీ పంటని
ఇంటికి చేర్చి, కూలీలకు డబ్బులతో పాటు వరి బియ్యం కూడా ఇచ్చి, పండగ పూట ఇలాగె ఖద్దరు పంచె కట్టుకుని రొమ్ము విరుచుకుని, మీసం తిప్పుతూ
వూరిలో నడుస్తుంటే ఆయన్ని మొక్కని జనం అంటూ లేరు. నిన్నిలా చూస్తుంటే మళ్ళి ఆ రోజులు గుర్తు వస్తున్నాయి.. అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు”
ఇదే మంచి సమయం అనుకున్నాడేమో  తన మనసులో ఉన్న మాట చెప్పేసాడు. ” నాన్న నేను డాక్టర్ అవ్వను..
అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతా” అన్నాడు. తప్పకుండా నన్నా అని మళ్ళి కొడుకుని ముద్దాడాడు. “ఇదోగో నీకు కూడా ఒకమొక్క తెచ్చాను”అంటూ ఒక మొక్కను తండ్రికి అందించాడు.
ముగ్గురూ మూడు మొక్కలను పట్టుకుని,భవిషత్ తరాలు చెప్పుకునే “అనగనగా ఒక రైతు, తాను దగా పడ్డ విషయం తెలుసుకున్నాడు, చైతన్యంతో మేల్కొన్నాడు, తన నుదుటి రాత తానె మార్చుకున్నాడు…… అన్న కధని వాస్తవం లో జరిగేలా చూడటం కోసం కథం తొక్కుతు కదిలారుా మూడు తరాల ప్రతినిధులు .. ..
జై జవాన్
జై కిసాన్
ప్రకటనలు

8 thoughts on “Anaganaga Oka Raithu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s