Jagamantha Kutumbam

 

                                                       జగమంత కుటుంబం

Sirivennela

శరత్ కాలం, పున్నమి రాత్రి, జగమంతా వెన్నెల, రైలు ప్రయాణం, సైడ్ లోయర్ బెర్త్ , మనతో పాటు ప్రయాణిస్తున్నట్టు ఉండే నిండు చందురుడు. చేతిలో ఫుల్ ఛార్జింగ్ తో ఉన్న స్మార్ట్ ఫోను, చెవిలో హెడ్ ఫోన్స్, అవతల తనతో పెళ్లి కుదిరిన అమ్మాయి, చెవిలో అమృతం పోసినట్టు ఆమె చెప్పే తియ్యటి కబుర్లు నేరుగా గుండెల్లోకి జారిపోతుంటే… జీవితంలో ఇలాంటి రోజు, ఇలాంటి అనుభవం మళ్ళి మళ్ళి వస్తుందో రాదో అనుకుంటూ వెన్నెలని కన్నులలో నింపుకుంటూ, ఆమెమాటలని గుండెలలో దాచుకుంటూ అతడి ప్రయాణం సాగిపోతోంది.
“మన నిశ్చితార్ధం కూడా ఫిక్స్అయింది కధా.. ఒక్క సినిమాకి రావటానికి ఏంటి నీకు ఇబ్బంది? ప్లీజ్”
“నాకేం ఇబ్బంది లేదు, వచ్చి మాఇంట్లో వాళ్ళని అడిగి, వాళ్ళు ఎస్ అంటే తీసుకెళ్ళు”
“ఎడిసినట్టే ఉంది, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళటానికి మనమేమన్నా స్కూల్ పిల్లలమా? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి రా.. మీ వీధి చివర రిసీవ్ చేసుకుంటా సినిమా అవ్వగానే మళ్ళి అక్కడే దింపేస్తా.. సింపుల్”
“వీధి చివర ఢాకా వచ్చినవాడివి, ఇంటికి రావటానికి ఏమిటి ప్రాబ్లెమ్? ఏం పర్లేదు, ఇంటికి వచ్చి ఒక మాట చెప్పి తీసుకెళ్ళు”
“అందులో కిక్ ఏమి ఉంది అమ్మాయి.. కొన్ని చిలిపి పనులు దొంగతనంగా చేస్తేనే మా ఇగో satisfy అవుతుంది.”
“హా! మీ ఇగో satisfy అవుతుంది, తేడా వస్తే అందరి పరువు బజార్న పడుతుంది.. ఏమి అక్కరలేదు”
అరగంట నుండి వీళ్లిద్దరి మధ్య ఇదే డిస్కషన్ నడుస్తోంది.. ఇతడు దొంగతనంగా వెళదాం అంటాడు.. ఆమె వద్దు చెప్పే వెళదాం అంటుంది… ఆమెని యెలాగనిన ఒప్పించే పనిలో అతడు సతమతమవుతున్నాడు..
“హేయ్! నీ ఫోన్ లో వీడియో కాలింగ్ ఉందా” ఉన్నట్టుంది ఆశ్చర్యంగ అడిగాడు..
“లేదు! ఏం?”
“నాకు నీ మొహం కనిపిస్తోంది… చాల క్లియర్ గా”
“ఎక్కడా” కంగారుగా అడిగింది”
“ఒక్కసారి ఆకాశం లో చూడు”
ఆమె కిటికీ పరదా తొలిగించి ఆకాశంలో పున్నమి చంద్రుడిని చూసి తనలో తానె నవ్వుకుని, కాస్త గర్వపడి, ఇంతలో గొంతు సరి చేసుకుని
“నైస్ ట్రై! బట్ స్టిల్, నువ్వు ఇంట్లో అడిగితేనే నేను సినిమాకి వస్తా…” కచ్చితంగా చెప్పింది
దేవుడా! ఇంత పొగిడినా పడకపోతే ఇంకేం చేస్తాం అనుకుని… సంభాషణ కొనసాగించాడు…
“ఇంకా”
“ఇంకా… చెప్పాలి…”
మాటలు లేకపోయినా మాట్లాడాలి అనిపించే సమయమది…
“చందమామ చూసావా ఎంత అందంగా ఉందొ” సంభాషణ పొడిగించడానికి అన్నాడు
“చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడూ అందం గానే ఉంటుంది” అంది కొత్త విషయం ఏమైనా ఉంటె చెప్పు అన్న ధోరణిలో
“అవునా? అయితే ఒక్క ప్రశ్న. చంద్రునిలో మచ్చలు ఎందుకు ఉంటాయో చెప్పు”…
“హా! చిన్నప్పుడు మేము చదువుకున్నాం బాబు. నిజానికి అయితే అవి చంద్రుడి ఉపరితలం మీద ఎత్తు పల్లాలు, భూమి మీద నుండి చూసే వాళ్ళకి అవే రకరకాలుగా….
అంటే కుందేలు లాగ, చెట్టు కింద దోశలు పోస్తున్న అవ్వలాగా కనిపిస్తుంది.. అంతేగా?”
“నువ్వు ఇంకా ఎదగాలి బంగారం. ఫీజికల్గా కాదు రొమాంటిక్ గా…”
“అంటే ఎలాగో?”
“చంద్రుడు మనః కారకుడు, ఈ భూమి మీద దూరంగా ఉన్న ప్రేమికులకి పదే పదే వాళ్ళ పార్టనర్స్ ని గుర్తు చేస్తూ వాళ్లలో విరహాన్ని రేపుతూ ఉంటాడు. విరహాగ్నితో రగిలిపోయే వాళ్ళు విడిచే
వేడి నిట్టూర్పుల సెగ తగిలి తెల్లని చంద్రుడిపై ఆ నల్లని మచ్చలు వచ్చాయి అన్నమాట”
“వామ్మో.. ఏంటి ఇది కవిత్వమా?”
“కవిత్వం కాదు, కవిత్వానికి అంత్య ప్రాసలు ఉండాలి… ఇది భావుకత్వం.. మన మనసులోని భావాలతో ప్రకృతితో మమేకమవటం”
“బావుంది.. ఇంకా చెప్పు”
“నువ్వు రాత్రంతా ఇలా కబుర్లు చెబుతూనే ఉండు.. తెల్లారేసరికి వెన్నెల శతకమే రాసేస్తాను…” అన్నాడు నవ్వుతూ
ఈలోగా ట్రైన్ పక్క స్టేషన్ లో ఆగింది.. ఒక ఆడ మనిషి నెలల పిల్లాడిని చంకన వేసుకుని luggage ఈడ్చుకుంటూ ఇతడి దగ్గరికి వచ్చింది..
“అన్నా! చంటి బిడ్డతో ఉన్నాను. కాస్త ఈ బెర్త్ నాకిచ్చి నువ్వు అప్పర్ బెర్త్ మీద పడుకోవా?”
ఆమె మాటలు వినగానే అతడికి ఎక్కడ లేని నిరుత్సాహం కమ్ముకుంది. కేవలం లోయర్ బెర్త్ ఇవ్వడానికి అతడికి ఏమి అభ్యంతరం లేదు. కానీ వెన్నెల రాత్రి, ఫోన్ లో అమ్మాయి ఈ అనుభూతులని
వదులుకోవడానికి కాస్త ఆలోచిస్తున్నాడు.. పక్కన లోయర్ బెర్త్ లో ఆల్రెడీ పెద్దవాళ్లు పడుకున్నారు…
“నెలల పిల్లాడు అన్న.. మధ్య రాత్రి ఏడుస్తాడు.. బాత్రూమ్కి అది వెళ్తాడు.. అస్తమాను లేవాలి.. అందుకే అడిగాను అన్నా”
ఆమె సంజాయిషీ చెప్పుకునే వరకు వైటింగ్లో పెట్టానన్న గిల్ట్ ఫీలింగ్ అతడిని మరో మాట మాట్లాడకుండా… మరో ఆలోచన చెయ్యకుండా వెంటనే అప్పర్ బెర్త్ కి షిఫ్ట్ అయ్యేలా చేసింది.. లైట్ వెలుగు, ఫ్యాన్ సౌండ్
తప్ప ఏమీకానరాని అప్పర్ బెర్త్, ఉద్యానవనంలో స్వేచ్ఛగా తిరిగే వాడిని తీసుకొచ్చి జైలు గోడల మధ్య బంధించినట్టు ఫీల్ అయ్యాడు.. పైకి ఎక్కటంలో ఊడిపోయిన హెడ్డుఫోన్స్ మళ్ళి తగిలించుకున్నాడు..
“హలొ!…. హలో!.. ఉన్నావా? సిగ్నల్ కట్ అయిందా?” అవతలి స్వరం విని మళ్ళీ అతడు ఈ లోకం లోకి వచ్చాడు.
“హా! వినిపిస్తోంది చెప్పు” అన్నాడు నీరసంగా
“ఏంటి వాయిస్ లో జోష్ తగ్గింది..” అడిగింది ఆమె
“ఏమి లేదు.. ” అంటూ జరిగింది చెప్పాడు
“మరి నీ వెన్నెల శతకం, భావుకత్వం అన్ని ఏమయ్యాయి?”
“వెన్నెలకి గ్రహణం పట్టింది, భావుకత్వం మానవత్వానికి మంచం (లోయర్ బెర్త్) ఇచ్చి తాను అటక (అప్పర్ బెర్త్) ఎక్కింది.” విసుగ్గా చెప్పాడు..
“అబ్బా! ఎందుకంత విసుగు? ఒక్క లోయర్ బెర్త్ సాయం చేసినందుకే?”
“నా విసుగు లోయర్ బెర్త్ సాయం చేసినందుకు కాదు, జీవితంలో మళ్ళి తిరిగి వస్తుందో రాదో తెలియని ఒకమంచి అనుభూతిని కోల్పోయినందుకు. ఆ రెండిటికి తేడా తెలిస్తే ఈ టాపిక్ కంటిన్యూ చై
తెలియకుంటే ఇక్కడితో వదిలేయి” ఖరాఖండిగా చెప్పాడు.
“సరే సరే.. ఇర్రిటేట్ అవ్వకు.. అర్ధం అయిందిలే.. నీ హెల్పింగ్ నేచర్ చూస్తే ముచ్చట వేస్తోందోయ్.. నీకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది.. ”
“ఆహా! అమ్మాయిలకు గిఫ్ట్ లు పుచ్చుకోవటయే తెలుసు అనుకున్నాను, ఇవ్వటం కూడా తెలుసా” కాస్త వెటకారంగా అడిగాడు
“అంత వెటకారం వద్దమ్మా! అబ్బాయిలు ఇచ్చే ప్రతీ గిఫ్ట్ వెనక తిరిగి ఏదో ఆశిచడం ఉంటుంది… కానీ అమ్మాయిలు ఇచ్చేవి తక్కువ గిఫ్టులు అయినా వెనకాల ఎంతో అభిమానం ఉంటుంది..తెలుసుకో”
ఆ మాటలు అర్ధం అవ్వడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టింది… అర్ధం అయ్యాక వామ్మో అనుకున్నాడు…
“సరే.. సరే. ఒప్పుకుంటున్నాను.. ఇంతకీ గిఫ్ట్ ఏమిటి?” ఆశగా అడిగాడు
“రేపు నేను నీతో సినిమాకి వస్తున్నాను..” క్లుప్తంగా చెప్పింది
అతడికి ఎగిరి గెంతేయ్యాలి అనిపించింది కానీ అప్పుడు అతడు ఉన్న పరిస్థితులలో సాధ్యం కాక మనసులోనే కుప్పి గెంతులు వేసుకుంటూ జల్సా సినిమాలో పాట హమ్ చెయ్యటం మొదలు పెట్టాడు,
“మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా.. తెలుసుకోవా అభీ…
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మరీ”
“ఆహా! దేనికోసమో ఆ వెయిటింగ్”?
“పెదవి పై… పలకదే… మనసులో ఉన్న సంగతి
కనులలో… వెతికితే…. దొరుకుతుంది”
“నాకు అంత అతీరిక లేదు గాని నువ్వే చెప్పు సంగతేంటో”
“టీ స్పూన్ టన్ను బరువు అవుతుందే..
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే”
“ఆహా! ఇంకా?”

“పెను తుఫాను ఏదైనా.. మెరుపు దాడి చేసిందా?
మునుపు లేని మైకాన మదిని ముంచి పోయిందా?”
“బాబు.. ఇప్పటి దాకా బాగానే ఉన్నావ్ గా.. అనవసరంగా ఒప్పుకున్న సినిమాకి వస్తానని?”
“ఊరకనే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా..
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెళ్ళా..
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగలా?”
“తలగడతో తలబడుతున్నావా? అది ట్రైన్ లో .. మరీ బరి తెగించేసావ్..ఇంకా నా వల్ల కాదు.. గుడ్ నైట్”
“ఎపుడెలాగా తెగిస్తానో నామీద నాకే అనుమానం..
మాటల్లో పైకి అనేస్తానో నీ మీద ఉన్న అభిమానం”
“వద్దు బాబోయ్.. నువ్వు ఇంకేం అనొద్దు.. త్వరగా ఇంటికి రా చాలు”
“త్వర త్వరగా తరిమినదే పద పద పదమని పడుచు రధం
ఎద లయలో ముదిరినదే మధనుడి చిలిపి రిథమ్.. “
“బాబూ నీకు పాట మొత్తం వచ్చు అని అర్ధం అయింది.. రాత్రంతా అలాగే పాడుకో..
ఎప్పుడైనా నిద్ర వస్తే.. పడుకో… గుడ్ నైట్” అని చెప్పింది
అతడు పాట తాలూకు మత్తులోనే ఉంది గుడ్ నైట్ చెప్పాడు..
“బాగా ఎక్కింది అబ్బాయిగారికి” అనుకుని ఫోన్ కట్ చేసింది.
అలా పాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు.


నిశ్చితార్ధానికి, పెళ్ళికి 3 నెలలు గ్యాప్ ఉండటంతో ఆ మూడు నెలల్లో దాదాపు ప్రతీ వీకెండ్ అతడు రైలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు…. ఒక వీకెండ్ తన ఊరికి, మరో వీకెండ్ ఆ అమ్మాయి ఊరికి.. ఆలా దాదాపు 3 నెలలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. అతడు టికెట్ బుక్ చేసిన 10 సార్లలో 8 సార్లు లోయర్ బెర్త్ వచ్చేది.. జర్నీ చేసేటప్పుడు ఎవరైనా పిల్లల గల తల్లులు గాని, వృద్ధులు గాని, పేషెంట్స్ గాని, వికలాంగులు
గాని, అడగగానే సంతోషంగా తన లోయర్ బెర్త్ ఇచ్చేసేవాడు.. ఒకసారి ప్రయాణంలో మాత్రం ఒక వింత అనుభవం ఎదురైంది. తన కేబిన్ లోనే ఉన్న ఒక వృద్ధ దంపతులకి ఇద్దరికీ అప్పర్ బెర్త్ వచ్చింది. వాళ్ళు అడగగానే ఇతడు తన లోయర్ బెర్త్ ఇచ్చేసాడు. రెండో లోయర్ బెర్త్ తోనే వచ్చింది సమస్యంతా. ఆ రెండో లోయర్ బెర్త్ ఒక 20 ఏళ్ళ స్టూడెంట్ ది. ఈ పెద్దాయన లోయర్ బెర్త్ అడగగానే అతడు నిర్మొహమాటంగా
ఇవ్వను అని చెప్పేసాడు. ఆశ్చర్యపోవటం ఇతని వంతు అయింది. పెద్దాయన మరోసారి వినయంగా అడగగా అంత అవసరం అయితే 200/- తనకి ఇచ్చి లోయర్ బెర్త్ కొనుక్కో మని సలహా కూడా ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఇది విని ఇంకా ఆశ్చర్యపోయాడు తాను. ఆ కుర్రాడికి కాస్త సర్ది చెబుదాం అనుకుంటుండగా దంపతుల మధ్య డిస్కషన్ మొదలయ్యింది. నువ్వు లోయర్ బెర్త్లో పడుకో అంటే నువ్వు లోయర్ బెర్త్లో పడుకో అని వాదులాడుకుంటున్నారు. “మీకసలే మోకాళ్ళ నెప్పులు పైకి ఎక్కలేరు, మీరు కింద పడుకోండి, నేను పైకి ఎక్కుతాను” అంటోంది ఆవిడ.
“నీకు ముందే నడుం నెప్పి, చేతులు పట్టు ఇవ్వవు, నువ్వు ఎలా పైకి ఎక్కుతావు? నువ్వే కింద పడుకో నేనే పైకి ఎక్కుతా” అని ఆయన అంటాడు ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత కూడా వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న concern చూసి ముచ్చట వేసింది అతడికి. ఇవేవి పట్టించుకునే స్థితిలో లేకుండా ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడు స్టూడెంట్. ఇంతలో ఫోన్ రావటంతో మాట్లాడుతూ కాస్త ఏకాంతం కోసం డోర్ దగ్గరకి వెళ్ళాడు స్టూడెంట్. అతడిని కాస్త కన్విన్స్ చేద్దామని వెనకే వెళ్ళాడు అతడు. ఫోన్ మాట్లాడుతున్నంత సేపు వాడి బాడీ లాంగ్వేజ్ గమనించ సాగాడు. 3/4 ప్యాంటు డ్రాయర్ బ్రాండ్ కనపడేలా ధరించి, ఒక చేతికి లాకెట్లు, మరోచేతికి ట్యాటూలు ధరించి, జుట్టు రెండువైపులా కత్తిరించి, మధ్యలో మిగిలిన జుట్టుకు బ్రౌన్ రంగు వేయించుకుని, మెడలో పూసల గొలుసు వేసుకుని ఇన్ని వస్తువుల ఐడెంటిటీ మధ్య తను మనిషినన్న ఐడెంటిటీ ఎక్కడో కోల్పోయిన వాడిలా తోచాడు. ఫోన్ మాటాడటం అయిపోయాక అతడిని హలో అంటూ పలకరించాడు. హాయ్! అని బదులు ఇచ్చాడు.
“వన్ స్మాల్ రిక్వెస్ట్. ఆ ఓల్డ్ పెయిర్ ని చూసారు కదా. వాళ్ళకి నా బెర్త్ ఇచ్చేసాను. థెయ్ అర్ హ్యాపీ. మీరు కూడా మీ లోయర్ బెర్త్ ఇచ్చేస్తే థెయ్ విల్ బి మోర్ హ్యాపీ. సో ప్లీజ్”
“అంత హ్యాపీగా ఉండాలి అనుకున్నవాళ్ళు ఇంట్లోనే కూర్చోవచ్చుగా.. అప్పర్ బెర్త్ లు వచ్చాయని తెలిసి ఎందుకు జర్నీ చెయ్యటం.”
“హోప్ తో బ్రదర్. మనలాంటి వాడు ఎవడైనా ఒకడు సహాయం చెయ్యకపోతాడా అన్న హోప్ తో.. పైగా వాళ్ళ జార్నీకి రీసన్స్ అడగటానికి మనం ఎవరం?”
“కరెక్ట్. వాళ్ళు ఎందుకు ప్రయాణిస్తే మనకెందుకు ఎలా ప్రయాణిస్తే మనకెందుకు.. అదే నేను చెప్పేది”
“మీకైమైన కోపం ఉందా పెద్దవాళ్ళ మీద? ఫర్ ఏని రీసన్?”
“నో… కోపమే కాదు నాకు వేరే ఏ ఫీలింగ్ కూడా లేదు. అందుకే నా కంఫర్ట్ వదులుకోను అంటున్నాను..”
“చూడు బ్రదర్… నువ్వు ఈ రోజు ఒకరికి హెల్ప్ చేస్తే రేపు ఎవరైనా నీకు అవసరం అయినప్పుడు హెల్ప్ చేస్తారు… ఒక్కసారి ఫ్యూచర్ లో నిన్నే వాళ్ళ పొజిషన్లో ఊహించుకో…”
“థాంక్స్ బ్రదర్. నాకు ఎవరి హెల్ప్ అక్కరలేదు.. నన్ను వాళ్ళ పొజిషన్లో ఊహించుకోమన్నావ్ కదా.. బై దట్ టైం ఐ విల్ బె ట్రావెలింగ్ ఇన్ మై ఓన్ లగ్జరీ కార్, అండ్ ఇన్ ప్లయిన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్ డిస్టన్స్స్, ఐ డోంట్ నీడ్ ఎనీ ఒన్స్ హెల్ప్”
ఇంకేం సమాధానం చెప్పాలో తెలీక అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఎదో గుర్తు వచ్చి “అన్నట్టు ఇందాక 200/- ఇస్తే అప్పర్ బెర్త్ ఇస్తాను అన్నావు? దానికి ఓకేనా?” చివరి అస్త్రం లాగా అడిగాడు.
“హమ్! ఓకే”
“ఇస్తాను.. కానీ ఫ్యూచర్ లో లగ్జరీ కార్లలోనూ ప్లయిన్ లలోను తిరిగే నీకు ఒకళ్ళనుండి డబ్బు ఎందుకు” తెలుసుకోవటం కోసమడిగాడు.
“ఇట్ ఈస్ అల్ డిమాండ్ అండ్ సప్లై రూల్. డిమాండ్ ఎక్కువ ఉండి, సప్లై తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ విల్ బి హై! చదువుకోలేదా? పైగా ఈ పెద్దవాళ్ళు వూరికే ఎం ట్రావెల్ చెయ్యరు.. సీనియర్ సిటిజెన్ కన్సెషన్స్ ఇచ్చి మరీ వీళ్ళ చేత ట్రావెల్ చేయిస్తోంది గవర్నమెంట్, అంత లోయర్ బెర్త్ కావాలి అనుకున్నవాళ్ళు టికెట్ మామూలు ధరకే కొన్నామనుకుని ఆ డబ్బులేవో బెర్త్ ఇచ్చినవాడికి ఇవ్వొచ్చుగా? ఆలా చేయరేం? నాలాటి కుర్రాడికి చెప్పుకోలేని ఖర్చులు ఎన్ని ఉంటాయి అని? ఇందాక ఫోన్ లో మాట్లాడానే.. నా గర్ల్ ఫ్రెండ్, దానికి టాక్ టైం, ఇంటర్నెట్ రెండు రీఛార్జి చేపించాలి అట.. అప్పుడే నాతో మాట్లాడగలదట, ఇలాంటివి ఎన్నో, అన్ని చెప్పుకోలేంఅక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై రులే”
“డిమాండ్, సప్లై, బిజినెస్, ప్రైస్ వీటన్నిటితో పాటు హ్యుమానిటీ అనేది కూడా ఒకటి ఉంది. తెలుసా?” వ్యంగంగా అడిగాడు
“తెలుసు. దాన్నే 200/- ఇచ్చి కొనుక్కోమంటున్నాను.. నొథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ థిస్ వరల్డ్” అంతే వ్యంగంగా సమాధానమిచ్చాడు
ఇంకా వాదించడానికేం లేక 200/- పర్సు లోంచి తీసి ఇచ్చి, ఓల్డ్ పెయిర్ కి ఏమి చెప్పద్దు అని చెప్పి, అతడి లోయర్ బెర్త్ వాళ్ళకి ఇప్పించాడు.. అదేంటో విచిత్రం ఇతడికి ఒక్కసారి థాంక్స్ చెప్పిన వాళ్ళు, ఆ స్టూడెంట్ కి మాత్రం ఒకటికి నాలుగు సార్లు థాంక్స్ చెప్పారు. ఆ కుర్రాడు ఏ మాత్రం సిగ్గులేకుండా వాళ్ళ తనకి చెప్పిన థాంక్స్ స్వీకరించాడు. ఇదంతా గమనించి కూడా అతడు తన పంధాని మార్చుకోకుండా తోటి ప్రయాణికులకు తోచిన సాయం చేస్తూనే తన ప్రయాణాల్ని కొనసాగించాడు. తన లోయర్ బెర్త్ అడిగిన వాళ్ళకి ఇచ్చేసి అప్పర్ బెర్త్ ఎక్కుతున్న ప్రతీసారి చిన్నప్పుడు వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కిన అంత సంబరపడేవాడు.


నాలుగు శరత్ కాలాలు గడిచాయి. వృత్తి రిత్యా, ప్రవృతి రిత్యా అతడు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి ఒంటరిగా, ఒక్కోసారి భార్యా, పిల్లాడు సమేతంగా. అయితే ఒకనాడు హఠాత్తుగా కుటుంబంతో సహా సొంత వూరు వెళ్లాల్సి వచ్చింది. టికెట్స్ బుక్ చేసుకుంటే రెండు అప్పర్ బెర్త్స్ వచ్చాయి. పిల్లాడితో అప్పర్ బెర్త్ ఎలాగా అని భార్య అడగగా లోయర్ బెర్త్ దానం చెయ్యటంలో అతడికి ఉన్న ట్రాక్ రికార్డు చెప్పి.. తప్పకుండ మనకి లోయర్ బెర్త్ ఎవరో ఒకరు ఇస్తారు అని ధైర్యం చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ట్రైన్ బయలుదేరుతుండగా హడావిడిగా ఎక్కి, వచ్చి ఎదురుగ కూర్చున్నాడో నడి వయ్సక్కుడు . తనది లోయర్ బెర్త్ అని చెప్పి కిటికీ దగ్గరగా బెర్త్ కింద లగ్గేజి పెట్టుకున్నవాళ్ళని దెబ్బలాడి మరీ బయటకి తీయించి పక్కకి జరిపి తన లగ్గేజి అక్కడ పెట్టుకుని, తినడానికి తెచ్చుకున్న బిర్యానీ పొట్లం విప్పి ఎదురుగా పెట్టుకుని, ఆయాసం తగ్గడానికి నీళ్ల బాటిల్ ఓపెన్ చేస్తూ అన్నాడు.. “ఉత్తప్పుడు మనం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వచ్చి ఛావవు వెధవ ట్రైన్స్. అదే పనుండి కాస్త ఒక్క నిముషం లేట్ అయితే అప్పుడు మాత్రం కరెక్టుగా బయలుదేరి చస్తాయి”
అంటూ మంచి నీళ్లు గడ గడ తాగేశాడు. మిగితా లోయర్ బెర్త్లలో పెద్దవాళ్ళు ఉండటం తో.. అతడినే అడగక తప్పలేదు తనకి. బిర్యానీ తినే వరకు తినే వరకు వేచి ఉండి అప్పుడు అడుగుదాం అనుకున్నాడు. తిన్న బిర్యానీ పొట్లం అలాగే కిటికి లోంచి విసిరేసి, కింద పడ్డ మెతుకుల్ని కాళ్ళతో బెర్త్ కిందకి త్రోసేసి, వాటర్ బాటిల్ తో కిటికీలోంచి చెయ్యి కడిగేసుకుని అతడు నిద్రకి ఉపక్రమించబోయాడు. అప్పుడు ఇతడు వినయంగా “సర్, చిన్న పిల్లాడితో మా లేడీస్ ఉన్నారు.. కొంచెం లోయర్ బెర్త్ ఇచ్చి అప్పర్ బెర్త్ కి షిఫ్ట్ అవుతారా” అని అడిగాడు. అతడు అటు ఇటు ఎగా దిగా అటు ఇటు చూసి “ఇద్దరికి అప్పర్ బెర్త్ లే వచ్చినాయా? ఎప్పుడు బుక్ చేసుకున్నారు?” అంటూ ప్రశ్నించాడు.
“నిన్ననే తత్కాల్లో బుక్ చేసుకున్నాం.. ఇద్దరికీ అప్పర్ బెర్త్ లే వచ్చినయి, కాస్త మీరు షిఫ్ట్ అయితే….” అంటూ నాసిగాడు.
“పిల్లల్తో ఉన్నప్పుడు ఇలాంటి జార్నీలు చెయ్యకూడదు బాబు.. చూడు ఆడ పిల్ల ఇబ్బంది పడటంలా? నన్ను చూడు మూడు నెలలు ముందే టికెట్ బుక్ చేసుకున్నా హ్యాపీగా పోతున్నా” అంటూ ఎంత అసేపు డిస్కషన్ కొనసాగిస్తాడే గాని లోయర్ బెర్త్ ఇస్తాను అని మాత్రం అనటం లేదు. ఇతనికి ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు. చివరిగా అడిగాడు “సర్.. మీరు లోయర్ బెర్త్ ఇస్తున్నారా లేదా?”
“ఏమిటి అబ్బాయా డిమాండ్ చేస్తున్నావ్.. ఇయ్యకపోతే ట్రైన్ దించేస్తావా ఏమిటి” అని గట్టిగ నవ్వాడు. అతడి జోకుకి నవ్వు రాకపోగా అందరూ అతడిని ఏవగింపుగా చూసారు. అందరూ తననే చూస్తున్నారు అన్న విషయం అర్ధం కాగానే అతడు జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకోవటం మొదలు పెట్టాడు. అందరూ తనని చూస్తున్నారు అన్న విషయం అర్థం అయ్యింది గాని ఆ చూపులోని ఏవగింపు అతడికి అర్థం కాలేదు అన్న విషయం ఇతనికి అర్థం అయ్యింది. నిస్సహాయంగా భార్య వైపు చూసాడు. ఆమె అర్ధం చేసుకున్నట్టు పర్వాలేదులే అని తలాడించింది. మిడిల్ బెర్త్ వచ్చిన మరొక పెద్దాయన ఆయన మిడిల్ బెర్త్ నా భార్యకి ఇచ్చి అతడు అప్పర్ బెర్త్ తీసుకున్నాడు. ఇతనికి మాత్రం గుండెల్లో ఏదో అంటుకుంది. మనకి వస్తే ఎంత కష్టమయిన ఎదురు వెళ్తాము, అదే మన వాళ్ళకి అయితే చిన్న ఇబ్బందికి కూడా అల్లాడతాము. అతడి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. రాత్రంతా అప్పర్ బెర్త్ మీద పడుకుని తిరిగే ఫ్యాన్ రెక్కల వంక చూస్తూ ఎన్ని సార్లు తాను గతంలో తన లోయర్ బెర్త్ ని వదులుకుంది తలుచుకుని.. నిజంగా తనకి అవసరం అయినా నాడు.. బెర్త్ దక్కకపోగా అవమానంగా మాటలు వినాల్సి వస్తుందా అనుకుని తలుచుకుని తలుచుకుని రగులుతూనే వున్నాడు. మధ్య మధ్యలో తన భార్య పిల్లాడిని చూసుకుంటూ కూడా ఉన్నాడు. ఎప్పుడో తెల్లారు జామున నిద్ర పట్టింది అతడికి. ఇంతలోనే స్టేషన్ వచ్చేసింది అని భార్య అతడిని లేపింది. రాత్రి జరిగింది మరునాటికి మర్చిపోయే గజినీలాగ ఏమ్మా! మిడిల్ బెర్త్ లో బాగానే పడుకున్నట్టు ఉన్నారే అంటూ పళ్ళు ఇకిలిస్తూ పలకరిస్తుంటే… వాణ్ణి అమాంతం చొక్కా పట్టుకుని లేపి ట్రైన్ లోంచి బయటకి విసిరెయ్యాలి అన్నంత కోపం వచ్చింది ఇతనికి. ఎలా అణుచుకున్నాడో తెలీదు. కానీ ఆ సంఘటన మాత్రం అతడి మనసుని వెంటాడుతూనే ఉంది.. గాయం తాలూకు మచ్చలాగా….


తనకేదో అన్యాయం జరిగినట్టు, తానేదో ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టు అతడి మనసు రగులుతూనే ఉంది నెక్స్ట్ ట్రైన్ జర్నీ దాకా.. ఈ లోగ ఆ రోజు రానే వచ్చింది.. తనకి సైడ్ లోయర్ బెర్త్ వచ్చింది. ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడే గట్టిగ నిర్ణయించుకున్నాడు, మిన్ను విరిగి మీద పదా సరే, తన బెర్త్ ఎవరికీ ఇవ్వకూడదని. ట్రైన్ ఎక్కగానే ఇంకా ఎవరు రాకుండానే రెండు సీట్లు వాల్చేసి లోయర్ బెర్త్ చేసుకుని పడుకుని పోయాడు. కంపార్టుమెంట్ లో జరిగే అలజడి అంతా కళ్ళు మూసుకునే వింటున్నాడు. కాసేపు ఉన్నాక అతడికి ఒక అనుమానం వచ్చింది. తనని ఎవరైనా లోయర్ బెర్త్ అడుగుతారా లేదా.. తన ప్రతీకారం తీరుతుందా లేదా అని. మెల్లిగా ఒకకన్ను తెరిచి చూసాడు, అందరూ పెద్ద వాళ్ళే, ఎదురు బెర్త్ లలో ఎవరి పనిలో వారు ఉన్నారు. తినే వారు తింటున్నారు..వినే వారు వింటున్నారు, చెప్పే వారు చెబుతున్నారు, తనని మాత్రం ఎవరు లెక్క చెయ్యటం లేదు. క్షణ క్షణానికి అతడిలో అసహనం ఎక్కువ అవుతోంది. ఇంతలో వచ్చాడు ఒక పెద్దాయన, కాస్త కుంటుకుంటూ… వచ్చి పైకి కిందకి చూసి ఇతడిని బుజం తట్టి లేపి..
“బాబు! పెద్దవాడిని, ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్ కూడా జరిగింది.. పైకి ఎక్కలేను.. నువ్వు కాస్త పైకి సర్దుకుంటావా” అని అడిగాడు.
సిక్సర్ కొట్టటం కోసం బాడ్ బాల్ గురుంచి ఎదురుచూస్తున్న బ్యాట్స్మన్ ల ఉన్న అతడికి, తనకి కావలసినది దొరికింది. వెంటనే నోటికి పనిచెప్పాడు
“అప్పర్ బెర్త్ లెక్కలేని వారు ట్రైన్ ఎందుకు ఎక్కారు? లోయర్ బెర్త్ వచ్చినవాళ్లు అంతా సంఘ సేవకులు అని మీ ఫీలింగ్ ఆ?”
ఈ దురుసు మాటలు విన్న పెద్దాయన ఆశ్చర్యపడి, “అంత మాటలు ఎందుకులే బాబు, ఏదో కుర్రవానిని కదా సాటి మనిషికి ఇంత సాయం చేస్తావ్ ఏమో అడిగాను అంతే”
“చేస్తాం చేస్తాం.. అడిగినవానికి అందరికి సాయం చేసి మాకు అవసరం అయినప్పుడు మాత్రం అడుక్కుతింటాం” అన్నాడు మరింత ఉక్రోషంగా
చుట్టూ పక్కల వాళ్ళు అందరూ అతడినే చూస్తున్నారు.. ఆ చూపుల్లో ఏవగింపు అర్ధం చేసుకోలేనివాడు మాత్రం కాదు అతడు. కానీ ఇప్పుడతనికి కావలసింది అదే.. అతడు లోయర్ బెర్త్లు దానం చేసినప్పుడు ఎవ్వడైనా ఎన్నడైనా ఒక్క అభినందనతో కూడిన ఒక్క చూపు చూశాడో లేదో అతడికి గుర్తు లేదు. ఇప్పుడు మాత్రం అందరిచూపులు తన మీదనే.. ఈ గుర్తింపుకి అతడి అహం చల్లారినట్టు అనిపించింది.
ఆ పెద్దాయన కష్టపడుతూ అప్పర్ బెర్త్ ఎక్కుతుంటే ఈ ప్రయాణికులకు అందరికీ ఒక గుణపాఠం నేర్పనన్న భావన అతడికి కలిగింది. అది కాసేపే. లోయర్ బెర్త్ లో పడుకున్నాడే మళ్ళి అదే నిద్రాహీన అవస్థ. అటు ఇటు దొర్లగా దొర్లగా ఎప్పటికో నిద్ర పట్టింది. ఇలా నిద్ర పట్టిందో లేదో ఒక పీడకల, పైన పడుకున్న పెద్దాయన నెప్పి భరించలేక అల్లాడుతుంటే, అప్పర్ బెర్త్ తో సహా ఆనయ తన మీద పడినట్టు, తాను నలిగి నుజ్జు అయినట్టు కల. వెంటనే తేరుకుని చూసే సరికి తన గమ్యం వచ్చింది. కల తాలూకు అపరాధ భావం వెంటాడుతుంటే వెంటనే లేచి ఎవరి వైపు చూడకుండా సామాన్లు తీసుకుని ట్రైన్ ఆగగానే దిగిపోయాడు. అతడు స్టేషన్లో ఎస్కేలేటర్ దగ్గరికి వచ్చేసరికి అది ఎందుకో చిన్న రిపేర్ వచ్చి ఆగింది. వెను తిరుగుదాం అంటే వెనకంతా జనం.. సరే అని ఒక నిమిషం వెయిట్ చేద్దాం అని అలాగే నుంచున్నాడు. ఇంతలో వెనకాతల నుండి రాత్రి విన్న గొంతు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన వీల్ చైర్లో ఉన్నాడు, అయన కొడుకు అనుకుంటా.. చైర్ తోసుకుని వస్తున్నాడు. ఇతడు చెవులు రిక్కరించి వాళ్ళ సంభాషణ వింటున్నాడు.
“మీరు మరీ ఈ కాలితో అప్పర్ బెర్త్ లు అవి ఎక్కైకపోతే, కాస్త లోయర్ బెర్త్ వాడిని బెర్త్ ఇమ్మని అడగవచ్చు కదా” అన్నాడు కొడుకు
“అడుగుదామనే అనుకున్నానురా.. పాపం వాడు నా కన్నా వృద్ధుడు, నా కన్నా వికలాంగుడు, పైగా ఎదుటి వాడి కష్టం చూడలేని అంధుడు కూడా అందుకనే వదిలేసా” అని అన్నాడు
అంతే, కునుకుపాట్లు పడుతున్న మనిషి మొహం మీద వాటర్ బెలూన్ తో ఫాట్ మని కొట్టినట్టు, అతడి మనసుని ఎవరో చరిచినట్టు అనిపించింది. ఇంతలో ఎస్కేలేటర్ స్టార్ట్ అయింది.. జనం ముందుకు కదిలారు, అతడు మాత్రం అక్కడే నిలబడిపోయాడు. వెనక్కి వెళ్లి ఆయనకి సారీ చెబుదాం అనుకున్నాడు, కానీ శక్తీ సరిపోలేదు, అతడి ప్రమేయం లేకుండానే జనం అతడిని ముందుకు తోసుకుపోసాగారు. ఒక లగ్గేజి లాగా ఎస్కేలేటర్ మీద ఎక్కి ఓవర్ బ్రిడ్జి మీదకి చేరుకున్నాడు. పక్కనే కాస్త జాగా ఉంటె కూలబడ్డాడు. తాను వృద్ధుడా? అనుకోగానే “కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు” అన్న శ్రీ శ్రీ వాక్యాలు గుర్తుకు వచ్చాయి. తాను వికాలాగుండా? అనుకోగానే ఎందుకో తెలీదు మదర్ థెరిస్సా తాలూకు ఆత్మీయ స్పర్శ మనసుని తాకింది. తానూ ఎదుటి వాడి కష్ఠాలు చూడలేని అంధుడా? అనుకోగానే తాను ఎన్ని సార్లు ఎదుటి వారికీ లోయర్ బెర్త్ ఇచ్చి సాయపడింది గుర్తు వచ్చి కళ్ళు చెమ్మ గిల్లాయి.. ఎక్కడ జరిగింది తప్పింది? సాయం పొందనప్పుడా? సాయం చెయ్యనప్పుడా? రెండు సందర్భాలలోనూ జరిగిన నష్టం బేరీజు వేసుకుంటే తాను సాయం పొందనప్పటి కంటే, చెయ్య గలిగి ఉండి సాయం చెయ్యనప్పుడే ఎక్కువ వ్యథకు గురి అయినట్టు అర్థం అయింది. తాను సాయం పొందలేకపోవటం ప్రశాంత మైన చెరువులో చిన్న రాయి పడటం, కాసేపు అలజడిగా ఉన్నా మళ్ళి అంతా సర్దుకుంటుంది. కానీ తాను సాయం చేయకపోవటం నీరు ఎవరి దాహం తీర్చకుండా తనకు తానే ఇంకిపోవటం. ఇలా చేస్తే చివరికి మిగిలేదు బీడే. ఇలా అనుకుని ఇంటికి చేరాక దిగులుగా ఉన్న అతడిని చూసి ఏమిజరిగింది అని భార్య అడిగింది. ఏమి లేదని ఒకటి రెండు సార్లు దాటవెయ్యటానికి ట్రై చేసాడు గాని ఏదైనా పట్టుకుంటే వదులుతారా ఈ ఆడవాళ్ళూ? అతడిని ప్రశాంతంగా కూర్చో పెట్టి ఆరా తీసింది. అతడు జరిగింది అంతా చెప్పాడు. ఆమె పగలబడి నవ్వి ఈ మాత్రం దానికా ఇంత మధన పడుతున్నారు అని, ఆమెకి తెలిసినంతలో ఒక దివ్యోపదేసం చేసింది. అది విన్నాక అతడి మనసు
కుదుట పడింది.

కొద్ది రోజుల్లోనే మళ్ళి ట్రైన్ జర్నీ చెయ్యాల్సి వచ్చింది. స్టేషన్ కి ఆటోలో వెళ్తుంటే ఎఫ్ ఎం  లో పాట వినిపిస్తోంది.
“ఎండలను దండిస్తామ? వానలును నిందిస్తామా?  చలినెటో తరిమేస్తామా? ఛి పొమ్మని…
కస్సుమని కలహిస్తామా? ఉస్సురని విలపిస్తామా?  రోజులతో రాజీ పడమా  సర్లెమ్మని…
సాటి మనుషులతో మాత్రం… సాగనని  ఎందుకు పంతం?
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తాం  అంటే ఏం చెబుతాం?”

నిజమే కదా అనుకున్నాడు.

బుక్ చేసుకున్న సైడ్ లోయర్ బెర్త్ వచ్చింది. ఎవరు వచ్చి అడుగుతారా ఇచ్చేద్దామా అన్నట్టు సీట్ కూడా వాల్చకుండా అతడు అలాగే కూర్చున్నాడు. స్టేషన్ లు దాటుతున్నాయి కానీ ఎవరు అప్పర్ బెర్త్ వాళ్ళు రావటం లేదు. కిటికీ లోంచి బయటకు చూస్తే నిండు చందమామ.. అతడికి ఇది శరత్ కలం అని గుర్తు వచ్చింది. 5 ఏళ్ళ క్రితం ప్రయాణం గుర్తు వచ్చింది.
భార్యకి ఫోన్ చేద్దాం అనుకున్నాడు కానీ టైం చాల అయింది బాబుని పడుకో పెడుతూ ఉంటుంది అనుకుని ఊరుకున్నాడు. అలాగే చందమామని చూస్తూ కూర్చున్నాడు. ట్రైన్ ఒక జంక్షన్ స్టేషన్ కి వచ్చింది. ఇంజిన్ మార్చడానికి కనీసం అరగంట పడుతుంది. భోగి మొత్తం ఘాడ నిద్రలో ఉంది. ఇతడికి మాత్రం కునుకు దరి చేరటం లేదు. ఇంతలో భార్య చేసిన దివ్యోపదేసం గుర్తు వచ్చింది. ఎంత చక్కగా చెప్పింది అనుకుంటూ ఆమాటలు గుర్తు చేసుకున్నాడు.
“ప్రయాణాల్లో చిన్న చిన్న సర్దుబాట్లు సహజమే.. మేమేదో ఒకసారి లోయర్ బెర్త్ దొరక్క కాస్త ఇబ్బంది పడ్డాం అని మీరు మీ పంధాని మార్చుకోవక్కరలేదు, ఇలా మాటలు పడి మధన పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోసారి ఎప్పుడైనా మేము లోయర్ బెర్త్ దొరక్క ఇబ్బంది పడ్డం అనిపిస్తే మీరు ఒక్క పని చెయ్యండి. ఒక్కసారి ట్రైన్ దిగి వెళ్లి జనరల్ భోగీలు గమనించి రండి. మీ దుఃఖం పోకపోతే నన్ను అడగండి” అని చెప్పింది. ఆ మాటలు అతడికి అర్ధం అయ్యాయి. కానీ ప్రాక్టికల్ గా చూద్దాం అని ట్రైన్ దిగి, ట్రైన్ ఆసాంతం ప్లాటుఫార్మ్ మీద రెండు అటు ఇటు తిరిగాడు. జనరల్ బోగి ఎంత కిక్కిరిసి పోయి ఉందంటే, చంటి పిల్లల్ని ఎత్తుకుని వొంటి కాలి మీద ప్రయాణం చేస్తున్నారు పేదలైన ఆడవాళ్ళూ. దీనికి తోడు చమట కంపు, గుట్కా కంపు, టాయిలెట్ కంపు వీటన్నిటి మధ్య ఎంగిలి బీడీ పొగ. ఇది కదా కష్టం అంటే అనుకున్నాడు. ఈ కష్టం ముందు లోయర్ బెర్త్ ఏమిటి అప్పర్ బెర్త్ ఏమిటి అని అనుకున్నాడు. ఆ ప్రయాణికుల మీద కాస్త సానుభూతి కలిగింది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. అద్దాల కిటికీలకు పరదాలు కప్పుకుని, బయట ప్రపాంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా తమ ప్రయాణాన్ని హాయిగా సాగిస్తున్న ఏసీ భోగిల ప్రయాణికుల్ని చూస్తే కాస్త ఈర్ష్య కలిగింది అతడికి. తన స్థానం నుండి అటు వెళ్తే సానుభూతి, ఇటు వస్తే ఈర్ష్య, తనని సాయం అడిగిన వాడితో స్నేహం, తనకి సాయం చెయ్యని వాడితో ద్వేషం, ఏమిటి విరుద్ధ భావనలు, జీవితమే ఒక రైలు ప్రయాణం అని ఎవరు అన్నారో కానీ అతడికి ఆ నాడు తత్వం బోధపడింది.
ట్రైన్ కదలటంతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. నిద్ర మాత్రం రావటంలేదు. స్టేషన్ దాటగానే బోగీలో లైట్స్ అన్ని ఆరిపోయి చీకటిగా ఉంది. అతడు బాత్రూం కి వెళ్లి వస్తుంటే, ఒక లోయర్ బెర్త్ మీద ఒక కుర్రాడు కూర్చొని వెన్నెలని చూస్తూ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. అతడిని చూస్తే అయిదు ఏళ్ళ క్రితం తనకు తాను గుర్తు వచ్చాడు. మరో బెర్త్ పై ఒక చిన్నపిల్లాడిని పడుకోపెట్టి అతడు పడిపోకుండా కాపలాగా
పక్కకి వత్తిగిల్లి పడుకున్న తల్లిని చూస్తే.. తన భార్య పిల్లాడు గుర్తు వచ్చారు, అప్పర్ బెర్త్ పై సన్నగా గురక పెడుతూ గంభీరంగా పడుకున్న ఆయన్ని చూస్తే తన తండ్రి గుర్తుకు వచ్చాడు. మిడిల్ బెర్త్ పై దుప్పటీ కప్పుకుని ముడుచుకుని పడుకున్న ఆవిడని చూస్తే తన తల్లి గుర్తు వచ్చింది. ఈ బోగీ తన ఇళ్లులా, ఈ ట్రైన్ తన ఊరిలా అనిపించింది. అన్ని తరగతుల వారిని తనలో ఇముడ్చుకుని పట్టాలపై వేగంగా గమ్యం వైపు దూసుకుపోతున్న ట్రైన్ తన దేశంలాగా, డెవలపింగ్ నేషన్ లాగా అనిపించింది.

తిరిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. ఆలోచనలే తప్ప నిద్ర రావటం లేదు. కిటికీలోంచి బయటకు చూసాడు. అప్పుడు అతడున్న స్థితికి కిటికీ కిటికీల గాక అద్దం లాగ కనిపించింది. బయట ప్రపంచం అంతా అతడికి తన ప్రతిబింబం లాగ అనిపించింది. మబ్బుల్లో దోబూచులాడుతున్న నిండు చందురుడు కునుకు రాక ఇబ్బంది పడి మండుతున్న తన కన్నులాగా అనిపించాడు . ఆ భావం కలగగానే అతడికి ఏవో పాటల లిరిక్స్ గుర్తు వచ్చాయి.
“మింటికి కంటిని నేనై…. కంటిలో మంటను నేనై…….” ఏ పాట అబ్బా? అనుకున్నాడు… చరణాలు పాడుకుంటూనే పల్లవిని చేరడానికి ప్రయత్నించాడు..

“మింటికి కంటిని నేనై…. కంటను మంటను నేనై……
మింటికి కంటిని నేనై…. కంటను మంటను నేనై……
మంటల మాటున వెన్నెల నేనై… వెన్నెల పూతల మంటను నేనై”…
అప్పుడతడున్న పరిస్థితికి ఈ విరుద్ధ భావనలు సరిగ్గా సరిపోయాయి
రవినై , శశినై, దివమై, నిసినై …
నాతో నేను సహగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ…
ఒంటరినై ప్రతి నిమిషం.. కంటున్నాను నిరంతరం…
కిరణాల్ని కారణాల.. హరిణాల్ని హరిణాల..
చరణాల్ని చలానాల… చలనాల కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్ర జాలాన్ని…
అతడికి అది ఏ పాటో అర్ధం అయింది.. కానీ మనసుకి హాయిగా ఉండటంతో మరో చరణం లో లైన్లు కూడా గుర్తుతెచ్చుకున్నాడు
కవినై, కవితనై, భార్యనై, భర్తనై…
కవినై, కవితనై, భార్యనై, భర్తనై…
మల్లెల దారిలో… మంచు ఎడారిలో…
మల్లెల దారిలో… మంచు ఎడారిలో…
పన్నీటి జయ గీతాల… కన్నీటి జల పాతాల
నాతో నేను అనుగమిస్తూ .. నాతో నేను రమిస్తూ…
ఒంటరినై ప్రతి నిమిషం.. కంటున్నాను నిరంతరం…
కలల్ని, కథల్ని, మాటల్ని , పాటల్ని
రంగులనీ, రంగ వళ్ళులని.. కావ్య కన్నెలని.. ఆడ పిల్లల్ని …
పెదవిపై ఒక చిరునవ్వు మొలకెత్తగా పాట పల్లవి అందుకున్నాడు…
“జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే… సన్యాసం సూన్యం నాదే”

“జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాదిసంసార సాగరం నాదే… సన్యాసం సూన్యం నాదే”

జబ్బు చేసి ఉన్న శరీరానికి పత్యం ఎలా దివ్యఔషధమౌ అలజడిగా ఉన్న మనసుకి ఇలాంటి సాహిత్యం కూడా అంతే…

అతడి మనసు కుదుటపడి సావుధానంగా ఆలోచించసాగింది. జరిగిన పరిణామాలపై సింహావలోకనం చేసుకుంది. తోటి మనిషికి తోచిన సాయం చెయ్యటం మనిషి సహజ లక్షణం.. అదే తనకీ ఉంది..
ఆ లక్షణానికి పరీక్షా కాలం ఎదురైయింది.. పాఠం ముందు చెప్పి పరీక్ష తర్వాత పెట్టేది కాలేజీ అయితే.. పరీక్ష ముందు పెట్టి పాఠం తర్వాత నేర్పేది జీవితం. అందులో అతడు కాస్త తడపడ్డాడు.. ఆ తడబాటులో తప్పటి అడుగు వేసి దారి తప్పాడు.. దారి తప్పిన విషయం తెలుసుకుని కలవర పడ్డాడు..ఆ ఒంటరితనంలో గుణపాఠం నేర్చుకుని మళ్ళి తన సహజ లక్షణానికి తిరిగి వచ్చాడు.. దారి తప్పినప్పుడు అనుభవించిన ఒంటరి తనం వలన ఇంతక ముందు ఉన్న బంధాలు పరిచయాలు ఇప్పుడు మరింత దృఢంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అంతా తానుగా.. అందరూ తనవారిలా కనిపిస్తున్నారు. అతడికి తత్వం బోధపడగానే మనసుని పీడిస్తున్న అనుమానాలు, అవమానాలు అన్నీ ఎగిరిపోయాయి..
పదే పదే పాడుకోసాగాడు

“జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే… సన్యాసం సూన్యం నాదే”
“జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే… సన్యాసం సూన్యం నాదే”

అలా పాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు. కిటికీ లోంచి వెన్నెల ధారాళంగా అతడి ముఖం పై పడుతోంది. అతడికి జోల పాడుతున్నట్టు మిగితా పాటను చంద్రుడు పూర్తి చేసాడు.
“గాలి పల్లకి లోన తరలి తన పాట పాప ఊరేగి వెడలే” (అతడు నిద్రపోయే ముందు అతడి మనసుకి కలిగిన భావ తరంగాలు అన్ని, అన్ని దిశలా వ్యాపించి విశ్వ వ్యాప్తం అయ్యాయి)
“గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే” (ఆలోచనలు అన్ని వెళ్ళిపోయాక కాలీ అయిన గుండె హాయిగా విశ్రమించింది)
నా హృదయమే నా లోగిలి.. నా హృదయమే నా పాటకి తల్లి (నా హృదయమే నా అట స్థలం.. నా హృదయమే ఒక భావానికి జన్మ ఇవ్వడానికి ప్రసవ వేదన పడే నా తల్లి)
నా హృదయమే నాకు ఆలి… నా హృద్యయంలో ఇది సినీవాలి” (నా హృదయమే నా భార్య.. నాకు శాంతి స్థానం… నా హృదయంలో ఇది మరో చంద్రోదయం, మరో పున్నమి కోసం కళలను పోగేసుకుంటూ ప్రారంభించే ప్రయాణం).

“జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే… సన్యాసం సూన్యం నాదే”

ఆ తర్వాత అతడు ఎన్నో ప్రయాణాలు చేసాడు, ఏసీ ల్లోనూ, స్లీపర్ ల్లోనూ, అప్పుడప్పుడు జనరల్ ల్లోనూ కూడా.. ప్రతీ ప్రయాణం అతడికి కొత్త అనుభవాలని ఇస్తూనే ఉంది, కొత్త పాఠాలని నేర్పుతూనే ఉంది.
A small tribute to the Legendary writer Sri Sirivennela SeethaRaama Sastry Gaaru.

ప్రకటనలు

4 thoughts on “Jagamantha Kutumbam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s