మాట – మనసు

fe9e7640b72458c147d6b34e112e46a2

                               మాట – మనసు

ఒక పక్క పచ్చని పంట పొలాలు, మరో పక్క నిండిన చెరువులు  మధ్య సన్నని దారి. ఆ దారి గుండా వెళ్తున్న వాహనాలకు  స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టు వంగిన కొబ్బరి చెట్లు, సన్నాయి రాగాలు పలుకుతున్నాయా అన్నట్టు కోయిలల కుహు కుహులు.  ఇంత పల్లెటూరిలో  పెళ్లి  చూపులకి రావటం ఇదే మొదటిసారి.  అంటే పెళ్లి చూపులకి చాల సార్లే వెళ్లారు. పల్లెటూరిలో మొదటిసారి. పిల్లని చూడకుండానే ఆ ఊరితో ప్రేమలో పడిపోయాడు పెళ్లి కొడుకు.   దారి పొడుగునా పెళ్లి కొడుకుకి బ్రెయిన్ వాష్ జరుగుతూనే ఉంది. “ఒరేయ్! ఆ పిల్ల ముందు దిబ్బరొట్టెలా  కూర్చోకుండా ఎదో ఒకటి మాట్లాడు. నీ మౌనం తోనే ఇప్పటికి అరడజను పెళ్లిచూపులు చెల్లాచెదురు అయిపోయ్యాయి. తల్చుకుంటుంటేనే ప్రాణం పెట్రోల్లా ఆవిరి అయిపోతోంది” అని వాపోయింది తల్లి. సరే అన్నట్టుగా తలాడించాడు. నోటితో సరే అంటే ఎక్కడ మాట నిలుపుకోవాల్సి వస్తుందో అన్న భయంతో.
                                                                                  *****
గదిలో పెళ్లి కూతురుకి అలంకరణలు చేస్తున్నారు. పెళ్లి కూతురి అందాన్ని చూసి అద్దమే మురిసి మెరిసింది. ఇంతలో  తండ్రి వచ్చి అన్యాపదేశంగా చెబుతున్నాడు.  “చూడమ్మా నీకు తెలియంది ఏమి లేదు. భామ్మా ఆరోగ్యం బాగోలేని కారణంగా నిన్నీ  పెళ్ళికి తొందర పెడుతున్నామే తప్ప నువ్వంటే ప్రేమ లేక కాదు.  ఇది ఎప్పటికైనా  తీరాల్సిన బాధ్యతే కదా నాకు, అదేదో పెద్దావిడ ఉండగా కానిచ్చేస్తే నాకు ఆవిడకి కుడా తృప్తిగా ఉంటుంది. ఇంతకు ముందు పెళ్లి చూపుల్లాగా నిర్లక్ష్యంగా ప్రవర్తించి వాళ్ళే వద్దు అనేలా చెయ్యకు తల్లీ. కాస్త మన కుటుంబ పరిస్థితులను కూడా బుర్రలో ఉంచుకుని మసలుకోమ్మా.” అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి మాటలని తల  దించుకుని విన్న ఆమె గోళ్ళకి ఉన్న నైల్ పోలిష్ ఎరుపు రంగుని తీక్షణంగా చూస్తూ ఆమె అలానే ఉండిపోయింది.
                                                                                    ***********
పెళ్లి చూపుల హడావిడి చాల జోరుగా సాగుతోంది.  ఎవరికి వారు తమ గుణగణాల గురుంచి, ఆస్తి పాస్తుల గురుంచి, ఆచార సాంప్రదాయాల గురుంచి ఊదరగొట్టేస్తున్నారు.   అంత హడావిడిలోనూ ఇబ్బందిగా కూర్చుని దిక్కులు లెక్కపెట్టుకుంటున్నవారు ఇద్దరే ఉన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. కొంత సమయం గడిచాక, ఎవరో అన్నారు. వీళ్ళిద్దరికి ఒక 10 నిముషాలు ప్రైవేటుగా మాట్లాడుకునే అవకాశం ఇద్దామా. ఈ లోపు మనం ఇల్లు వాకిలి చూసి రావొచ్చు అని.  అంతా  సరే అని ఒప్పుకున్నారు.  పెరట్లోకి వెళ్ళబోతున్న పెళ్లి కొడుకుని పిల్ల మేనమామ చెయ్యి పట్టుకుని పక్కకి లాగి, “మా అమ్మాయి
భలే చమత్కారి. మీరు చెప్పేవి ఎయి విననట్టే ఉంటది. కానీ అన్ని వింటాది” అని హింట్ ఇచ్చినట్టుగా చెప్పాడు. అవునా అన్నట్టుగా తలాడించాడు పెళ్లి కొడుకు. ఆ దృశ్యం చూసి ధైర్యం ఊపిరి పీల్చుకున్నాడు పిల్ల తండ్రి.
పెరట్లోకి వెళ్ళబోతున్న పెళ్ళికూతురికి ఎదో పని ఉన్నట్టుగా వెళ్లి అడ్డు పడ్డాడు పెళ్లి కొడుకు బాబాయ్.  “చూడమ్మా,  మా వోడు మిత భాషి. ఇంత వయసొచ్చినా పాపం సన్నజాజులేవో,  మల్లెపువ్వులేవో తేడా పోల్చుకోలేడు.   నువ్వే కాస్త వాడిని మాటల్లో పెట్టి మాట్లాడించావంటే వాడేంత అమాయకుడో, అదే వాడేంత మంచోడో  నీకే అర్ధం అవుతుంది.  వాడిని మాటల్లోకి దించటం మాత్రం మర్చిపోకమ్మా”  అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే అన్నట్టుగా తలా ఊపింది పెళ్లి కూతురు. అది చూసి కాస్త ధైర్యం తెచ్చుకుంది పిల్లాడి తల్లి.
                                                                                         ************
  చక్కటి గాలి వీస్తున్న పెరట్లో, ఎదురెదురు కుర్చీల్లో వాళ్లిద్దరూ, వాళ్ళిద్దరి చుట్టూ ఏకాంతం, వాళ్ళిద్దరి మధ్య మౌనం మిగిలాయి.  తాను చూడాల్సిన మనిషి ఎదురుగానే ఉన్నా, లాంగ్ జంప్ చేసే కుర్రాడు అసలు జంప్ కి ముందు రెండు  చిన్న చిన్న గంతుల్ని ఊతంగా తీసుకున్నట్టు, చెట్టు మీద ఒక చూపు,పిట్టల మీద ఒక చూపు ఊతంగా తీసుకుని మూడో చూపుని ఆమె మోము మీద ల్యాండ్ అయ్యేలా చూసాడు.  ఈ చూపుల్ని పట్టుకుందామనే  ఆమె ఇందాకటినుండి ఎదురు చూస్తూనే ఉంది. వాళ్ళిద్దరి చూపులు లాక్ అయ్యాయి.   కొద్దీ క్షణాల చూపుల కలయికలో ఒక జీవిత కాలం బంధం పెనవేసుకున్నట్టు అనిపించింది. ఆ చూపుల బంధం నుండి బయట పడాలని ఇద్దరికి అనిపించలేదు.
మొదట ఆమె మాట్లాడింది కవ్వింవుగా “మీరు మూగ వారా?”
“అవునండి” మొదటిసారి నోటితో బదులిచ్చాడు.
“అందుకేనా! మిత భాషి, మౌన ముని  అని ఏవో చెప్పి నాకు అంటగట్టేయ్యాలి అని చూస్తున్నారు”
“అందుకేనండి! చూస్తే తెలివైనవారిలా ఉన్నారు. జాగర్త పడండి.”
“పడతాంలే  గాని.. చెప్పండి! మీరు మూగవారు ఎలా అయ్యారు?”
“మనసుని  దాచుకోవటం చేతకాక”
“మనసుని దాచుకోవాలని ఎందుకనుకుంటున్నారు”?
“మనసుని మనసులా ఎవరూ చూపించుకోలేకపోతున్నారు  కాబట్టి!”
“అర్ధం కాలే”
“అర్ధం అయ్యేలా చెప్పమంటారా?  అయితే ఒక ప్రశ్న. మీకు ఈ పెళ్లి ఇష్టమేనా?”
సూటిగా వచ్చిన ప్రశ్నకి క్షణం కంగారు పడి, “ఇష్టమేనా అంటే, ఆడ పిల్ల చదువయ్యాక ఎటూ పెళ్లి చేసుకువాలి, నేను కొంత కాలం ఆగుదాం అనుకున్నాను,
కాని మా బామ్మ ఆరోగ్యమ్ బాగోలేదని ఇంట్లో వాళ్ళు కాస్త తొందరపెడితే, ఎటు తప్పనిదే కదాని తప్పక ఒప్పుకున్నాను.”
“ఇప్పటి వరకు మీరు చెప్పినవి పరిస్థితులు, ఇప్పుడు అచ్చంగా కళ్ళు మూసుకుని మీ మనసు ఏమి చెబుతోందో అదే చెప్పండి”
విప్పారిన కళ్ళతో అతడిని ఒకసారి చూసి తలాడించి కళ్ళు మూసుకుంది. “పెళ్ళికి పెట్టె ఖర్చులో పదోవంతు పెట్టి భామ్మకి వైద్యం చేయించచ్చు కదా.. 
నన్నో ఒకటి రెండు సంవత్సరాలు జాబ్ చేసుకొనివ్వొచ్చు కదా, అన్ని కుదురుకున్నాక అప్పుడు పెళ్లి పెట్టుకోవచ్చు కదా” అని చెబుతోంది అంది. 
 
“చూసారా మీ మాటకి మీ మనసు మాటకి ఎంత వత్యాసం ఉందొ” అని అడిగాడు 
నిజమే కదా అన్నట్టు తలాడించింది ఆమె. 
 
“ఇలా మనసు మాటకి, మనిషి మాటకి  తేడాలు ఎక్కువయ్యేకొద్దీ, మనం మాటలని వాడేది మనసుని ఆవిష్కరించడానికి బదులు, మనసుని కప్పి పుచ్చటానికి 
అయ్యేకొలది మనిషి మాటల  మీద నమ్మకం కోల్పోతాడు. చివరికి నాలా ఇంట్రావర్ట్ అవుతాడు.”
సగం అర్థం అయ్యి సగం అర్థం కానట్టు ఆమె తలాడించి, “నాకిలాంటి పరిస్థితి కొత్త . బహుశా ఇదే మొదటిది ఏమో కూడా. మీకు మాత్రం ఇలాంటి పరిస్థితిలు చాలానే ఎదురైనట్టు ఉన్నాయి? మిమ్మల్ని ఇలా ఇంట్రావర్ట్ చేసిన పరిస్థితులు ఏంటో చెబుతారా?”
కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి “ఒకటని కాదు, జీవితంలో చాల సంఘటనలు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితంలో ప్రతీ స్టేజీలోనూ
నేను బాగా సంతోష పడ్డ, లేక భాద పడ్డ విషయం ఆ తర్వాత కాలంలో దాన్ని ఒక అనుభవమే అని అంటారని, అంతకి మించి వేరే ఏ ప్రాధాన్యం లేదని తెలిసినప్పటినుండి, అనుభూతులని నోరారా వర్ణించటం కన్నా మనసారా ఆస్వాదించటం ఎక్క్కువ అలవాటు చేసుకున్నాను.సో మనసు ప్రాధాన్యం పెరిగి
మాట ప్రాధాన్యం తగ్గింది క్రమంగా”
“ఇందాక ఒక సగం, ఇప్పుడు సగం లో సగం, అంటే ముప్పావు అర్థం అయింది.  పూర్తిగా అర్థం అయ్యేలా ఒక ఉదాహరణతో చెప్పగలరా.”
“హమ్! మీ కళ్ళ  ముందో పిల్లాడు ఐస్ క్రీం కోసం నెల మీద పది కాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు అనుకుందాం. అప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటారు? మీరు సాక్షి మాత్రమే.. ఆ పిల్లాడికి మీరే ఐస్ క్రీం కొనిచ్చే అధికారంలాంటివి ఏమి మీకు లేవు.”
ఒక్క క్షణం అలోచించి “పాపం పిల్లాడు, ఐస్ క్రీం కోసమే ఇంతలా ఏడుస్తున్నాడు.. అదే జీవితం అనుకుంటున్నాడు, వీడికి కాస్త మత్యురీటీ వస్తే ఆ కన్నీళ్లను
వేరే వారికోసం వాడుకోవచ్చు కదా” అని అనిపిస్తుందేమో.. నాట్ sure”
“గుడ్ కొంచెం అటు ఇటుగా అదే అనిపిస్తుంది… యు అర్ రైట్”
“ఇప్పుడు అదే పిల్లడు, ఐస్ క్రీం దొరికి పరమ సంతోషంగా తింటున్నాడు. అప్పుడేమి అనిపిస్తుంది”
ఈ సారి  త్వరగానే సమాధానం చెప్పింది “ఒక్క చిన్న ఐస్ క్రీం కె వీడు ఇస్తా సంబరపడిపోతున్నాడు, జీవితం లో ఇంకా వీడు చూడాల్సిస సంతోషాలు
ఇంకా ఎన్ని ఉన్నాయో కదా” అనిపిస్తుంది
“100% కరెక్ట్.  ఇప్పుడు మనమే ఆ చిన్న పిల్లాడు. జీవితంలో  రకరకాల స్టేజెస్ లో కావాల్సిన రకరకాల వస్తువులే ఆ ఐస్ క్రీంలు … లైక్  స్కూళ్ళో  ర్యాంకులు, ఆటల్లో ప్రైజులు, కాలేజీలో ప్రియురాళ్లు అలాగ అన్నమాట. మనం ఆ పిల్లాడ్ని గమనించినట్టే,  ఆకాశమునుండి రెండు కళ్ళు నిత్యం మనల్ని పరిశీలిస్తున్నాయి,
మన దుఃఖం, సుఖం,కోపం, సంతోషం అన్నిటినీ అవి  గమనిస్తున్నాయి  అన్న భావన ఎల్లప్పుడూ మన మనసులో నాటుకుపోయింది అనుకోండి .. మనకి ఐస్ క్రీం దొరకలేదు, అంతలా కింద పడి  కొట్టుకోగలమా?, ఒకవేళ దొరికింది, అంత ఆబగా చెయ్యి నోరు ఏకమయ్యేలా తినగలమా? మంచి అయినా చెడు  అయినా మన మీద మనకి ఒక కంట్రోల్ వస్తుంది కదా? స్వతహాగా మనుషులకి ఇది కొంచెం అలాస్యంగా వస్తుంది.. నా విషయంలో కాస్త ముందే వచ్చింది. అంతే వీళ్లందరి దృష్టిలో ఇంట్రావర్ట్ ను అయిపోయాను. నిజానికి పేకాట క్లబ్బుల్లోనూ, పేరంటాళ్లలోనూ వీరందరూ వారం  రోజుల పాటు మాట్లాడుకునే పొల్లు  కన్నా నాలో నేను, నాతో నేను ఒక్క గంట మాట్లాడుకునే సమాచారం చాలా  విలువైనది, ఉపయోగకరమైనది అయినప్పుడు
నాకింక మాటలతో  పనేముంది, మూగవాడిని కావటంలో ఆశ్చర్యమేముంది.”
ఇప్పుడు ఆ అమ్మాయికి మొత్తం అర్థమయింది. “ఇంటరెస్టింగ్! అంటే నవ్వినా, ఏడ్చినా  కన్నీళ్లే వస్తాయి అన్నాడో సినీ రచయిత, అలాగా ఈ  రోజు మనం కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా మరునాటికి అది ఒక జ్ఞ్యాపకమే కాబట్టి దాని గురుంచి ఓ హైరానా పడిపోకుండా సున్నితంగా స్వాగతించి తిరిగి పంపిచేయాలి అంటారు అంతేనా?” ఆత్రంగా అడిగింది.
ఇన్నాళ్లు అతనికి పుస్తకాలు చదివి అందించటమే తెలుసు. కాని మొదటి సారి, ఒక అమ్మాయి, తన కంటికి నచ్చిన ఒక అమ్మాయి, తన మనసునే ఒక పుస్తకంలాగా చదువుతుంటే… అందులో ఉండే పరవశం ఏంటో అతనికి మాత్రమే అర్ధం అవుతుంటే.. మూసి మూసి నవ్వులతో ప్రకృతికేసి చూస్తూ తనని 
తానె మైమరచి పోతున్నాడు.. 
 
“అదిగో మీరు మళ్ళి మీ లోకo లోకి వెళ్లిపోయారు” అని హెచ్చరించింది
 
అతడు మళ్ళి  ఈ లోకం లోకి వచ్చి, ‘చెప్పాగా! కొత్త  అనుభూతులను  ఆస్వాదిస్తున్నా…. “
“సంతోషం.  సో మీ 28 ఏళ్ళ సుదీర్ఘ గత జీవితంలో ఒక దొరికిన ఐస్ క్రీమ్, ఒక దొరకని ఐ క్రీమ్ గురుంచి చెప్పండి”
“హమ్! కాలేజీ డేస్ లో ఇంటర్ కాలేజీ టెన్నిస్ ఛాంపియన్ షిప్ సింగిల్స్ టైటిల్ గెలవటం చాల గొప్పగా అనిపించింది. చాల కాలం  పాటు ఆ కప్పునే చూస్తూ 
పొంగిపోయా… కాని ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడనిపిస్తుంది, అంత టాలెంట్ ఉన్నవాడివి, కాలేజీ డేస్ లో ఆ ఫ్రెండ్స్, చాట్టింగ్స్, ఈమెయిల్స్, ఆ తిరుగుళ్ళు అన్ని 
పక్కనపెట్టి, పూర్తిగా ఆట పైనే దృష్ఠ్టి పెట్టి ఉంటె అదే నీ ప్రొఫెషన్ అయ్యి ఉండేది కదాని.. ఆ టైం లో తట్టలేదు.. ఇప్పుడా కప్పు చూస్తే మాత్రం, నాకు అదే అనిపిస్తుంది… రెండోది నేను ప్రేమించిన అమ్మాయి.. నాలుగేళ్లు అంత ఇష్టంగా ప్రేమించానా, అసలు చెప్పటమే రాలేదు.. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే మాత్రం భలే  కోపం వచ్చింది, నా మీద నాకే…  చాల కాలం భాధ పడ్డా  కూడా..  కాని ఇప్పుడనిపిస్తుంది ఆ రోజుల్లో నీ గురించే నీకో స్పష్టత లేదు.. నీకు తోడు 
మరో అమ్మాయి కూడానా…  ఏ మాత్రం తేడా జరిగినా ఇద్దరి జీవితాలు ఎటో కొట్టుకుని పోయేవి అని..  ఇప్పుడాలోచిస్తే అంత మంచికే జరిగింది అనిపిస్తుంది 
ఆ అమ్మాయికి పెళ్లితో మంచి జీవితం  దొరికుంటుంది.. మనకి జీవితం పట్ల కాస్త మేచ్యురిటీ దొరికింది అని…..అలా దొరికిన ఐస్ క్రీమ్ వెంటనే అరిగిపోయింది, 
దొరకని ఐస్ క్రీం ఒక జ్ఞ్యాపకంగా మిగిలిపోయింది….” అని ముగించాడు
జీవితం  పట్ల అతడికి ఉన్న అవగాహనకి ఆమె ముచ్చటేసింది.. ముందు మూడు నాలుగు పెళ్లి చూపుల్లో చూసింది కదా, మీ గురుంచి చెప్పండి అనగానే
జాబ్ ఇంటర్వ్యూ లో HR రౌండ్ లో లాగ, నేను ఇది చదివాను, ఇంత సంపాదించాను, అంత దాచాను, ఇన్ని తిరిగాను అని పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోయిన వాళ్ళేగాని, జీవితాన్ని ఇంత ఆస్వాదించాను అని చెప్పినవాడు ఒక్కడు లేదు. ఇతను కానక మాట్లాడకపోయి ఉంటె అసలలాంటి వారు కూడా ఉన్నారన్న విషయం తనకి తెలిసేది కూడా కాదు ఏమో అనుకుంది.
“సరే ఇంతక ముందు చాల పెళ్లి చూపులు చూసారని విన్నాను. ఆ అమ్మాయిలకి
ఈ విషయాలు అన్ని చెప్పారా?” అనుమానంగా అడిగింది
“లేదండి!” వినయంగా చెప్పాడు
“ఏం?”
“అంటే వాళ్ళు ఎస్ అన్నా  నో అన్నా  నాకు పెద్ద  తేడా ఏమి అనిపించలేదు, సో సైలెంట్గా ఊరుకున్నాను. కానీ మీరు మాత్రం ఒకవేళ నో అంటే
దానికి కారణం నేను గాని నా మౌనం గాని కాకూడదు అనుకున్నాను, అందుకే మనసు విప్పి మాట్లాడాను.”
“అంటే నేను నో చెప్పడానికి మీ వైపునుండి ఏమి కారణాలు ఉండకూడదా? అంటే నేను ఎస్ అనాలని అనుకుంటున్నారా? నా కారణాలతో నేను నో చెబితే ఫర్వాలేదా?”
“ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. వాటెవర్ ఇట్ మే బి”
“అబ్బో! మొగ  హృదయాలలో కూడా ఆడవాళ్ళ నిర్ణయాల్ని గౌరవించే అంత సున్నిత హృదయాలు ఉంటాయి అన్నమాట”
“నిలువెత్తు సాక్షం! మీ ముందే నిలబడి ఉన్నాను”
“అయితే ఒక్క కండిషన్! పెళ్లి అయ్యాక ఒక రెండు సంవత్సరాలు నేను జాబ్ చేస్తా.. మా బామ్మకి పూర్తిగా నయం చేసి నా మనసు మాటని మా ఇంట్లో వాళ్ళ అందరికి వినిపిస్తా. నేను తలొంచింది మీ పెద్దరికాన్ని గౌరవించి గాని, నాకు వ్యక్తిత్వం లేక కాదు అని ఎలుగెత్తి చాటుతా”
“తప్పకుండా”
“హయ్! మరింక ఆలస్యం ఎందుకు.. వెంటనే నాకు ప్రపోజ్ చెయ్యండి…”
ఈ సారి ఆశ్చర్యపోవటం ఇతని వంతు అయింది. “ప్రపోసల్? మనమేమన్నా లవర్స్ ఆ?”
“అవును. ఎందుకు కాకూడదు? ప్రేమించుకున్నవారు అందరూ పెళ్లి చేసుకున్న చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకునే వారు అందరూ
తప్పకుండ ప్రేమించుకోవాలి. . పైగా నాలుగేళ్లు కాలేజీ రోజుల్లో గుండెళ్ళో పట్టుకుని తిరిగిన మాటాయే, ఇంకెత కాలం దాచుకుంటారు, బరువుకి గుండె కడుపులోకి జారిపోయిన జారిపోవచ్చు. త్వరగా చెప్పేసి తేలిక పడిపోండి, మీ బదులు మీ తలపులతో నేను బరువెక్కిపోతాను….పైగా ఇంట్లో వాళ్ళ మీద ఉన్న గౌరవంతో
చిన్నపటినుంచి ఎన్నో లవ్ ప్రొపొసల్స్ తిరస్కరించి, తిరస్కరించి విసిగిపోయి ఉన్నాను. కనీసం ఒక్కరికి అయినా ఎస్ చెప్పానని ఫ్రెండ్స్ తో గర్వంగా చెప్పుకుంటాను. అన్నిటికి మించి మీరు మొదటి సారి నా కళ్ళలోకి చూసినప్పుడే పడిపోయారని నాకు అర్ధం అయింది”కొంటెగా అసలు విషయం చెప్పింది.
మనసులోంచి ఉవ్వెత్తు తరంగంలా ఒక భావన వొళ్ళంతా తాకుతూ వచ్చి చిరునవ్వు రూపంలో బయటకి పోయింది అతడికి.
పక్కనే ఉన్న ఎర్ర గులాబీ చెట్టు నుండి ఒక గులాబీ తుంపబోయి, ఒక్క క్షణం ఆగి, కుండీ పళంగా ఆ మొక్కని తెచ్చి, కుడి  మోకాలి మీద కూర్చుని
పూల కుండీ  అందిస్తూ అడిగాడు,
                              “నా మౌనానికి భాష్యం నువ్వు అవుతావా?
                               నా మనసుకి మాటవి నువ్వు అవుతావా?”  అని
   కుండీ జాగ్రత్తగా అందుకుని ఆమె బదులిచ్చింది
                           “నీ ఏకాంతం లో కాంతను నేను అవుతాను!
                             నీను మాట్లాడించే మనసుని నేను అవుతాను! అని
    ఆ మాటలు పూర్తి అవగానే ఆ ప్రాంగణం అంతా చప్పట్లతో మరు మ్రోగింది. పొలాలు చూసి వస్తాం అని వెళ్లిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చారో వీళ్ళు
గమనించలేదు.  వీరి నిర్ణయం మాత్రం అందరికి సమ్మతం అని అర్ధం అయింది.
ప్రకటనలు

4 thoughts on “మాట – మనసు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s