Reviews

వంగవీటి సినిమా :  సమీక్ష కాదు విశ్లేషణ 

సత్యం థియేటర్ లో జాతీయ గీతం మొదలవ్వగానే హౌసేఫుల్ అయిన థియేటర్  జనం మొత్తం లేచి నిశ్శబ్దంగా నిలబడటంతో, ఈ అంశం పై ఫేస్బుక్ లోను వార్తా  పత్రికలలోనూ జరుగుతున్న రచ్చకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్ధం అయింది. జాతీయగీతం పూర్తి అయ్యి కూర్చోగానే  ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ పడింది.  థియేటర్ అంతా మూడో వంతు ప్రేక్షకుల అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ ట్రైలర్ అవ్వగానే గౌతమి పుత్ర  శాతకర్ణి  ట్రైలర్ మొదలయియింది. మొదటి ట్రైలర్ వస్తున్నప్పుడు శాంతంగా ఉన్నవాళ్లలో చాలామంది ఇప్పుడు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించి మళ్ళి  థియేటర్ అంతా మారుమ్రోగించారు. ఆ తర్వాత జరిగిన వచ్చిన యాడ్స్ అన్నీ,  ఆ సినిమా ప్లాప్ అని వీళ్ళు,  ఈ సినిమా ప్లాప్ అని వాళ్ళు అరుచుకోవటం లోనే వినుమరుగు అయిపోయాయి.  ఇంత ఉపోద్గాతం  ఎందుకంటె ఇప్పుడు మొదలవ్వబోయే అసలు సినిమా కూడా చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ  సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా. రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన సామజిక వర్గాల మధ్య ఆరని కాష్టంలా, తీరని వైరంలా పాతుకుపోయిన శత్రుత్వం లోంచి పుట్టుకుని వచ్చిన వికృత చేష్టల కథ.  వర్మని ఇన్స్పైర్ చేసేవి ఇలాంటి వికృత చేష్టలే.  కానీ యెంత వికృతమైన  అవి వాస్తవాలే కాబట్టి అసలేం జరిగింది, ఎలా జరిగింది, వర్మ ఎలా తెరకెక్కించాడు అన్న ఉత్సుకత ప్రతీ ప్రేక్షకుడిలోనూ ఉంటుంది కాబట్టి, ఈ సినిమా తెరకెక్కడానికి కారణం అయిన  ఆనాటి  పరిస్థితులనుండి  ఈనాటి పరిస్థితుల వరకు ఒకసారి  సింహావలోకనం చేసుకుంటే….

అరాచకానికి ఆరంభం:

 ఏ వ్యవస్థ లో అయితే పేద బడుగు బలహీన వర్గాల శ్రమలు దోచుకో బడతాయో, ఏ వ్యవస్థలో అయితే నిమ్న వర్గాల హక్కులు కాలరాయ బడతాయో ఆ వ్యవస్థలో ఒక తిరుగుబాటు వస్తుంది. 25 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కూడా విజయవాడలో సరిగ్గా అలాంటి తిరుగుబాటే కమ్యూనిస్టుల రూపంలో నుండి వచ్చింది. రిక్షా యూనియన్లు,ఆటో యూనియన్లు ఇతర వ్యాపారస్తుల వంటి వారి సపోర్ట్ వెంట బెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడుపుతూ, చట్టం తో పరిష్కారం కానీ సమస్యలను, సెట్టిల్మెంట్లు రూపంలో, ప్రైవేట్ సైన్యంతో పరిష్కరిస్తూ వెంకట రత్నం నాయకత్వం వర్ధిల్లుతోంది.
సరిగ్గా అదే సమయంలో ఉయ్యురు నుండి విజయవాడ వలస వచ్చిన వంగవీటి కుటుంబం ట్రాన్స్పోర్ట్ రంగంలో స్థిరపడే ఆలోచనలో ఉంది. నలుగురు అన్న తమ్ముళ్లలో ఒకడైన వంగవీటి రాధ మాత్రం వెంకటరత్నం ఇమేజ్ కి ఫిదా అయ్యాడు.  తాను కూడా అలాంటి ఇమేజ్నే కోరుకున్నాడు. స్నేహితులతో కలసి తన పరిసరాల్లో జరిగే గొడవలకి పరిష్కారాలు చూపుతూ క్రమంగా తన బలం పెంచుకుంటూ చివరకి వెంకటరత్నం సమూహంలో చేరాడు.  వెంకటరత్నం కనుసైగల్లో పనిచేసినంతకాలం అంతా బాగానే ఉంది.  కానీ  ఉడుకు రక్తం ఉరకలు వేయటంతో  తన సామ్రాజ్యం విజయవాడ అంతా  విస్తరించాలి అన్న లక్ష్యం చివరకి వెంటకరత్నం తోనే  విబేధాలు తెచ్చి పెట్టింది.  తన ఎదుగుదలకి అడ్డు తగులుతూ, తనని తొక్కిపెట్టి ఉంచాలని చూస్తున్న వెంకట రత్నాన్ని  తన సహచరులతో కలసి అతి కిరాతకంగా హత్య చేస్తాడు  రాధ. విచిత్రం ఏమిటంటే అప్పటి వరకు వెంకట  రత్నం వైపు ఉన్న యూనియన్లు, వ్యాపారస్తులు అంతా రాదనే తమ నాయకుడిగా ఎన్నుకుంటాయి. దాంతో పోలీసులకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది.  ప్రజాధరణ  ఉన్న నాయకుడిని ఏ పోలీసు మాత్రం ఏమి చేస్తారు? వారు కాస్త గమ్మున ఉంటె, దెబ్బ తగిలిన వాడే మరో రోజు వీడిని శిక్షిస్తాడు. అలా క్రమంగా బెజవాడ లోని లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ప్రభుత్వం చేతుల్లోంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మారిపోతున్నాయి.  రాధ ఇదే ఉత్సహంతో  తన బుద్ధికి తోచిన న్యాయాన్ని తనకి నచ్చిన వాళ్లకు చేసుకుంటూ, క్రమ క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నాడు.
అంతకాలం మనలో ఒకడిగా ఉన్నవాడు ఈ రోజు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగాడంటే, వాడిని మనం ఓన్ చేసుకోవటానికి మనం వాడే మొదటి అస్త్రం కులం. ఇది మన ఆలోచనలలోనే, మన వ్యవస్థలోనే లోనే ఉన్న ఒక జాడ్యం. ఈ రోజుకి ఈ పరిస్థితులలో ఏ మార్పు రాలేదు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ, సింధు ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరింది అనగానే, గూగుల్ లో ఎక్కువగా  సెర్చ్ కాబడిన కీవర్డ్  “Sindhu’s Caste?”
కాపు సామజిక వర్గం అంతా రాధాకి తోడు అయ్యారు. రాధ కూడా తన ప్రాభవంతో  సాయం అని అడిగివనాడికి తనకి తోచిన న్యాయం చేసి పంపిచేవాడు. ఈ క్రమం లోనే కమ్మ సామజిక వర్గానికి చెందిన దేవినేని గాంధీ, నెహ్రూలు కూడా రాధ అండతో స్టూడెంట్స్ రాజకీయాలలో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. బెజవాడలో ఉండే అన్ని యూనియన్స్ మరియు వాళ్ళ లీడర్స్ ని ఒక్కతాటిపైకి తెచ్చి రాదని ఏక ఛత్రాధిపతిని చేసారు.  తమ ప్రాభవం పూర్తిగా కోల్పోతున్నాం అని గ్రహించిన కమ్యూనిస్టులు రాధ హత్యకి రంగం సిద్ధం చేసారు.  నమ్మిన వ్యాపారస్తుని సాయంతో రాదని ఒక షెడ్డుకి రప్పించి పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన మూకతో పాశవికంగా రాధని , రాధని  రప్పించిన వ్యాపారస్తుని కూడా చంపేసి  కేసు కి ఎక్కడ లింక్ దొరకకుండా చూసుకుని వాళ్ళు  వాళ్ళ  ప్రదేశానికి తిరిగి వెళ్లిపోయారు.  అక్కడితో రాధ కధ  ముగిసింది.

కొత్త నాయకుడు రంగా:

రాధ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టాలని దేవినేని వాళ్ళకి మనసులో ఉన్నా, ఈ దేశం లో ఎవరైనా ఒక నాయకుడు హత్య గావించబడితే,  తదనంతరం ఆ స్థానాన్ని అదే కుటుంబలో ఉన్నవాళ్ళే  చేపట్టాలనే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న రాచరిక ఆచారం ప్రకారం వంగవీటి రంగా తెరపైకి రావటం జరిగింది. ప్రతీ ర్రాజకీయ పార్టీలోనూ ఉండే అంతః కలహాలు లాగానే,  గ్రూప్లో యువ నాయకుని మాట చెల్లలా? లేదా సీనియర్ కార్యకర్త మాట చెల్లలా? అన్న విషయం మీద విభేదాలు వచ్చి  వంగవీటి రంగాకి, దేవినేని ముఠాకి మధ్య విభేదాలు తలెత్తాయి.  తమ సామజిక వర్గాలు కూడా వేరు అవ్వటంతో  బేషుగ్గా విడిపోవచ్చు అని దేవినేని వాళ్లు భావించి వేరుకుంపటి ప్రారంభించారు.  వీళ్ళ సామజిక వర్గాలు వేరు కావటంతో కొన్ని యూనియన్లు అటు మొగ్గటం ప్రారంభించాయి.  తన ఏక ఛత్రాధిపత్యం చేజారిపోతోంది అని తెలిసిన రంగా, గాంధీ హత్యతో వాళ్ళని కంట్రోల్ చెయ్యాలి అనుకున్నాడు. కాని గాంధీ హత్యతో అవి ఆగకపోగా రెండు కుటుంబాల మధ్య పోరు, రెండు వర్గాల పోరుగా మారి నివురు గప్పిన నిప్పుల మారి అవకాశం కోసం ఎదురుచూడ సాగాయి.  రంగా  కీర్తి బెజవాడ దాటి రాష్ట్రం అంతా వ్యాపించింది.  రౌడియిజం నుండి రాజకీయం దిశగా రంగ అడుగులు సాగాయి.  విజయవాడలో తిరిగి పట్టు సాధించడానికి కాంగ్రెస్ కి రంగా రూపం లో మంచి ఊతం దొరికింది. రంగ పేరుప్రతిష్టలు లోకల్ స్థాయి నుండి రాష్త్ర స్థాయికి ఆపై జాతీయ స్థాయికి పెరిగాయి.   ఇంతక ముందు రౌడీగా కష్టపడి చేసిన పనులు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కను సైగలతో చెయ్యగలగటంతో, రంగా  కాస్త మెత్తబడటం అదునుగా చూసిన దేవినేని మురళి, అదే కాంగ్రెస్ లోని అసమ్మతి నాయకుని బలం చూసుకుని గాంధీ హత్య లో నేరుగా ముద్దాయిలైన వారిని ఒక్కొక్కరిని హతమార్చటం మొదలుపెట్టాడు.  అదే సమయంలో కమ్మ సామజిక వర్గానికి కొండత అండగా ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించటం దేవినేని వాళ్ళకి కలిసొచ్చింది.  తన అన్న హత్యకి ప్రతీకారంగా మురళి నేరుగా రంగానే  టార్గెట్ చెయ్యటం మొదలుపెట్టాడు.
వర్గ పోరాటాలలో ముందడుగు ఎప్పుడు తానె వేసే రంగా, నెల్లూరు నుండి వస్తున్న మురళీని  దారికాసి దారుణంగా చంపించాడు.  విజయవాడ ఉలిక్కి  పడింది, రాష్ట్రం అట్టుడుకుంది. అధికార పార్టీ ఈ హత్యా రాజకీయాలకి, విజయవాడ రౌడీయిజానికి చరమగీతం  పాడాలి అన్న నిర్ణయానికి  వచ్చింది. ప్రభుత్వం తమదే అయినప్పుడు, పోలీసు యంత్రంగం తమ ఆదేనంలో ఉన్నప్పుడు, ఒక క్రిమినల్ ని కంట్రోల్ చెయ్యడానికి ఏమిచెయ్యాలో  అది చెయ్యలేదు. ఎందుకంటే ఒక స్థాయి దాటినా వాళ్ళని  ఈ చట్టాలు, లా అండ్ ఆర్డర్ లు ఏమి చెయ్యలేవు అని తెలుసు. పైగా ప్రత్యర్థి  జాతీయ పార్టీ నాయకులలో ఒకడు. ఇంక  మిగిలింది ఒక్కటే ఆప్షన్.  పకడ్బందీగా  హత్య గావించటం.  ఇక్కడ జరిగింది కూడా అదే.  తెలుగుదేశం రాజకీయా విధి విధానాలు ఎండ గడుతూ, తనని నమ్ముకుని ఉన్న జనాలకి భూమి  పట్టాలు ఇప్పించటం కోసం, నిరాహార దీక్ష చేపట్టి,
డిసెంబర్ నెల, అర్ధరాత్రి చలిలో,  ఆహార లేమితో, నిరాయుధుడై, నీరసంగా ఉన్న రంగా మీద, ఒక బస్సు నిండా అయ్యప్ప మాలలతో వచ్చిన రౌడీలు జరిపిన పైశాచిక మారణకాండ, విజయవాడ చరితలోనే రక్తా అక్షరాలతో ముద్ర పడిపోయి ఉంది. ఈ హత్యతో మారణహోమం ఆగలేదు, మరింత పెరిగింది. రెండు వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. సామాన్య జనానికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మిగిలింది.  నెల  రోజులు రాష్ట్రం రావణ  కాష్టంలా  మండాక, అప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ  గొడవల్లోంచి మరో రంగ గాని  మరో నెహ్రు గాని పుట్టుకుని రాకుండా, ఎవరిని బిజ్జగించాలో వారిని బుజ్జగించింది. ఎవరిని లొంగతీసుకోవాలో వారిని లొంగతీసుకుంది.  కేసు సిబిఐ కి అప్పగించినా  కూడా, నిందితులు అందరు పోయేవరకు రిపోర్ట్ రాకుండా ఎలా లాలూచి పడాలో ఆలా లాలూచి పడింది.
రౌడీయిజం VS రాజకీయం:
రంగ మరణంతో  రౌడీయిజం అంతమయ్యింది అనుకుంటే  అది పొరపాటే.  రౌడీయిజం రాజకీయం ముసుగు తొడిగింది. రెండు వర్గాల మధ్య వైరం  ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయికి చేరుకుంది. విక్రమార్కుడు  సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంద. ఊరుకి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడు అయ్యిండాలి అని. అలాగే రాజకీయాలలో కూడా అదే నియమం. ప్రాంతానికి ఒక్కడే రౌడీవోడు ఉండాలి, వాడు అధికార పార్టీ వాడు అయ్యిండాలి అని.  రౌడీయిజాన్ని అణిచివేద్దాం  అని నిర్ణయించుకున్న ప్రభుత్వం, విజయవాడ వర్గ పోరాటాలలోనుండి వచ్చిన  రంగ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది మంచిది.
కానీ దాదాపు ఇలాంటి పరిస్థుతులలోంచే, రాయల సీమ కరువు కాటకాలలోంచి, ఫ్యాక్షన్ గొడవలోంచి పుట్టిన నాయకుడు పరిటాల రవిని ఎలా డీల్ చేసిందో చూసాం కదా. కారణం, ఒకటే సామజిక వర్గం. తెలుగు దేశం అధికారం లో ఉన్న0త వరకు ఒక వెలుగు వెలిగిన రవి, ప్రభుత్వం  మారగానే దారుణంగా చంపబడ్డారు.  రవి హత్యలో ప్రధాన నిందితుడు కూడా తర్వాత జైలులో చంపబడ్డారు.  రంగ హత్య ఉదంతంలో సంబంధం ఉన్నవాళ్లు గత 30 ఏళ్లుగా అనేక పార్టీలు మారుతూ ఉండటంతో చల్లబడింది అనుకున్న వర్గ పోరు కొత్త రూపు దాల్చుకుంది.  దాని ఫలితమే  ప్రభుత్వం మారినప్పుడల్లా వందల్లో జరిగే రాజకీయ హత్యలు.
తాజా పరిణామాలు:
ఇంక  తాజా రాజకీయ పరిణామాలను చూస్తే,  అధికార పార్టీని ఇరుకున పెట్టె ఉద్దేశంతోనే పద్మనాభం  అనే నాయకుడు   ఒక సామజిక వర్గన్ని ఉద్ధరిస్తానని చెప్పి గొంతెమ్మ కోర్కెలు కోరి, అన్ని రాత్రి రాత్రే తీర్చమని వత్తిడి చేసి, ఉద్యమాలు రేపి చివరకి రైళ్లు తగలపెట్టేవరకు వెళ్లాడంటే, ఇది ఆలోచించాల్సిన విషయమే.
మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. పదవి కోల్పోగానే  రాజకీయ నాయకుడు  శాంతి భద్రతలని భంగం  చెయ్యటం కోసం పాత కేసుల్ని, గొడవలన్నీ తిరగ తోడుతుంటాడు.  ఇంచు మించుగా ఇక్కడే అదే జరుగుతోంది అనిపించట్లా?  గత ఎన్నికల్లో గెలుపు ఖాయం అనుకున్న ఇప్పటి ప్రతిపక్ష నేత, తన ఓటమికి కారణం చివరినిముషంలో తెలుగుదేశం లో చెయ్యి కలిపినా పవన్ కళ్యాణ్ అని, అతడి సామజిక వర్గానికి, తెలుగు దేశం పార్టీ సామజిక వర్గానికి ఉన్న యేళ్ళనాటి శత్రుత్వం మరుగునపడటమే దీనికి కారణం అని భావించి మళ్ళి ఆ నిప్పుని రగల్చడానికి ఈ ఉద్యమానికి వెనకుండి ఊపిరి పోస్తున్నాడని అర్ధం కావటంలే? పవన్ కళ్యాణ్ తనకి కుల మతాల పట్టింపు లేదని, జాషువా కలలు  కన్న విశ్వనరుడు తానె అని ఎంత మొత్తుకున్నా…   ఒక్కసారి గ్రామాలలోకి వచ్చి చూడండి…  కాపుల ఐఖ్యత వర్ధిల్లాలి, కాపు సంఘం జిందాబాద్ అని రాసిన  బ్యానెర్ల మీద ముఖ్యంగా కనిపించేవి  పవన్ కళ్యాణ్, చిరంజీవి బొమ్మలే.  మీకు ఆ ఫీలింగ్ లేకున్నా, మిమ్మల్ని ఓన్ చేసుకునే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటె చాలు. ఇంకా మీ చేతిలో ఏమి ఉండదు.
అసలు ఇదే పద్నానాభం, తమ సామజిక వర్గానికే చెందిన దర్శకరత్నం కేంద్ర  మంత్రిగ పనిచేసి తన తెల్లటి దుస్తులకి బొగ్గు మరకల్ని  అంటిచుకు తిరుతున్నప్పుడు ఏమైయ్యాడు?  తన సామజిక వర్గానికే చెందిన మెగాస్టార్, పార్టీ ని తాకట్టు పెట్టి టూరిజం మంత్రిగా అంతర్జాతీయ చలన  చిత్రోత్సవాలకి సకుటుంబంగా షికార్లు కొట్టి వచ్చినపుడు ఏమైయ్యాడు? ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా ప్రశ్నించారా? అసలు ఆ ఇద్దరు కాపు నాయకులకే ఒకరికి ఒకరు పడక సినిమాలలోనూ, స్టేజిలా మీద,  ట్విట్టర్లలోనూ  ఒకరిని ఒకరు ఆడిపోసుకుంటూ ఉంటారే. మరి అలాంటి  ఇద్దరిని ఒక్క హోటల్కి రప్పించి కలిసి statement ఇప్పించేలా చేసిందంటే రాజకీయాలలో కులానికి ఉన్న ప్రభావం ఏమోటో అర్ధం కావటంలే? వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటే మరిన్ని కుల సంఘాలు ఉద్యమాలు లేస్తాయి.  ఒప్పుకోకపోతే  ప్రభుత్వ వస్తులు ద్వంసం కాబడతాయి. శాంతి భద్రతల కాపాడే విషయంలో వారి మీద కేసులు పెడితే, అప్పుడెప్పుడో కమ్మ కాపు గొడవలు జరిగాయి. ఇదంతా ఆ పగల ఫలితమే అన్న ప్రచారం మొదలు. ఏ రకంగా చూసినా కలసికట్టుగా ఉన్న రెండు సామజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి  వచ్చే ఎన్నికలలో అయినా మనవైపు తిప్పుకుందాం అన్న చౌక బారు ఆలోచన తప్ప మరేమీకాదు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి, సీమాంధ్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తాడా లేక ఇలాంటి చవక బారు ఆరోపణలను ఎదుర్కోవటం లోనే సమయం గడిపేస్తాడా అంటే ప్రతి పక్షానికి మాత్రం రెండోదే కావాలి. ఇది క్లియర్.
అరె! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఐదేళ్లు వారిని పని చేయనిద్దాం..  ఏమైనా లోపాలుంటే ఎండకడదాం.. ఆ తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి అని వాళ్లనే నిర్ణయించుకుంటారు అన్న కనీస ఇంగిత జ్ఞ్యానం కూడా లేకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తేనే అధికారం లోకి వస్తాం అని గుడ్డిగా నమ్మే వాడిని వాడి దేవుడే కాపాడాలి.
ముగింపు:
అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాను ఆంటే.. సినిమాలో ఒక వర్గం వాళ్ళని చంపడానికి సన్నద్ధం అవుతున్నప్పుడు ఈ వర్గం వాళ్ళు చప్పట్లు కొట్టి మీసాలు మెలివెయ్యటం, అలాగే ఈ వర్గం వాడిని చంపడానికి సన్నద్ధం అవుతున్నప్పుడు  ఆ వర్గం వాళ్ళు విజిల్స్ వేసి తొడలు కొట్టడం చూస్తుంటే మనం ఇంకా ఏ దశాబ్దంలో ఉన్నామో, ఏ శతాబ్దంలో ఉన్నామో అర్ధం గాక తలలు పట్టుకున్న నాలాటి వాళ్ళని కాస్త ఓదార్చే ప్రయత్నం లో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఏ  నాయకుడు అయినా, జనం లోంచి పుడతాడు తప్ప కులం లోంచి కాదు. అతడు కాస్త ఎదిగాక జనాలే కులం పేరుతో అతడిని ఓన్ చేసుకుంటారు. ఆలా కొన్ని పరిమితులు దాటాక ఒక కులానికి కొమ్ము కాసేవాడు అని పేరుపడ్డాక  మిగితా కులాలవారికి తన ప్రమేయం లేకుండానే శత్రువు అవుతాడు. తన సామజిక వర్గం శాసించే పార్టీ అధికారం లో ఉంటె పెంచబడతాడు… తమ ప్రభుత్వం అధికారం కోల్పోగానే తుంచబడతాడు… ఇది ఆ కులం అని ఈ కులం అని లేదు…  కులాభిమానం రాజకీయాలని శాసిస్తున్నంత వరకు చరిత్రలో జరిగేది ఇదే.. కాబట్టి కులాల కుంపట్లని ఎవరు రగిల్చినా అది వారి స్వార్ధ ప్రయోజనాలకే తప్ప అందులో సంఘ హితం, సమాజ శ్రేయస్కరం ఏమి ఉండదు.  సామాన్య జనులు దయచేసి కులం కుంపట్లో పడి  సమిధలు కావొద్దు. కులం ప్రాతిపదికన జరిగే ఏ ఉద్యమాలకి మద్దతు తెలపొద్దు. ఎవరి కులం వారిని వాళ్ళు ఆదరిద్దాం, సాటి కులం వాళ్ళని గౌరవిద్దాం.  అధికారంలో ఉన్నవారికి మంచి పనులు చెయ్యటానికి సహకరిద్దాం, వారు మంచి పనులు చెయ్యకపోతే ఓటుతోనే వేటు వేద్దాం.  ఈ దేశంలో పుట్టిన ప్రతీవాడికి ఎదో ఒక కులం ఉంటుంది. సో, నాయకులని మనం కులం చూసి కాదు గుణం చూసి ఎన్నుకుందాం.
వంగవీటి సినిమాని తెరకెక్కించిన వర్మ, మర్డర్ ప్లాన్లని చూపించినంత వివరంగా, విపులంగా  జరిగిన పరిణామాలని జనాలు ఎలా అర్ధo   చేసుకోవాలో  చెప్పకుండా..  విజయవాడ కనకదుర్గమ్మ సాక్షం చెప్పలేదు, నవ్వుతు ఉండిపోయింది అని ఒక ఎస్కేపిస్ట్ ధోరణిలో సినిమాని ముగించడం అసంతృప్తిగా అనిపించి, నాకు తొంచింది, నాకు అర్ధం అయింది మీతో పంచుకోవాలనే తాపత్రయంతో ఈ పోస్ట్ రాసాను. అర్ధం చేస్కుని ఆదరించగలరు.
జైహింద్
ప్రకటనలు

2 thoughts on “Reviews

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s